నిజామా అన్న ఆశ్చర్యం అక్కర్లేదు.. పన్ను లేని దేశాలు చాలానే!
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఏ వస్తువును వాడినా..కొన్నా.. వస్తుసేవల్ని తీసుకున్నా పన్ను తప్పదు. ఈ పన్నుల మోత ఒక లెక్క అయితే.. అనారోగ్యం వచ్చి ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నా పన్ను పోటే.
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఏ వస్తువును వాడినా..కొన్నా.. వస్తుసేవల్ని తీసుకున్నా పన్ను తప్పదు. ఈ పన్నుల మోత ఒక లెక్క అయితే.. అనారోగ్యం వచ్చి ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నా పన్ను పోటే. అది ఇది అన్న తేడా లేకుండా ప్రతి అంశంలోనూ పన్నుబాదుడు ఒక ఎత్తు అయితే.. ఇవన్నీ పోగా.. ఏడాదిలో వచ్చే ఆదాయం మీదా పన్ను వేసే తీరు చూస్తే.. పన్నులు కట్టేందుకే పుట్టామా? అన్న ఫీలింగ్ కలుగకమానదు.
మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే వార్షిక బడ్జెట్ కు కాస్త ముందు.. బడ్జెట్ ప్రవేశ పెట్టిన కొంతకాలం వరకు ఆ ఏడాది వార్షిక పన్ను మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద బోలెడంత చర్చ జరుగుతూ ఉంటుంది. కొందరైతే నిత్యం ప్రతి అంశానికి పన్నులు కట్టేస్తున్నప్పుడు.. మళ్లీ ఈ ఆదాయ పన్ను ఎందుకు? అన్న సూటి ప్రశ్నను సంధిస్తుంటారు. వారి వాదన విన్నప్పుడు నిజమే కదా? అన్న భావన కలుగుతుంది.
ఇలాంటి వేళ.. ఆదాయపన్ను లేని దేశాలు ఉన్నాయన్న మాట వింటే.. నిజమా? అన్న ఆశ్చర్యానికి గురవుతుంటారు చాలామంది. ఆదాయపన్ను మాటే లేని కొన్ని దేశాల గురించి తెలిసినప్పుడు వావ్ అనుకోకుండా ఉండలేం. రోజువారీగా భారీగా పన్నులు చెల్లిస్తున్న వేళ.. మళ్లీ ఆదాయపన్ను అవసరమా? అన్న ప్రశ్నల నేపథ్యంలో ఆదాయపన్ను అన్నదే లేని దేశాల జాబితాను చదవాల్సిందే.
వార్షిక ఆదాయపన్ను లేని దేశాల జాబితాలో..
- సౌదీ అరేబియా
- యూఏఈ
- కువైట్
- ఖతర్
- ఒమన్
- బహ్రెయిన్
- బ్రూనై
- ఉత్తర కొరియా
ఈ దేశాలతో పాటు దక్షిణ అమెరికా ఖండాల పరిధిలోని మరికొన్ని దేశాలు ఉన్నాయి. అవేమంటే..
- కేమన్ ఐలండ్స్
- బెర్ముడా
- బహామాస్
- ఆంగ్విలా
- సెయింట్ కిట్స్ అండ్ నీవిస్
- బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్
- టర్క్స్ అండ్ కేకోస్
- ఆంటిగ్వా అండ్ బార్బుడా
- సెయింట్ బార్తెలమీ
యూరోప్ లోని కొన్ని దేశాలు కూడా ఉన్నాయి.. అవేమంటే..
- వాటికన్ సిటీ
- మొనాకో
- వాటిస్ అండ్ పుటునా
- వనువాటు
- నౌరు
మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. పలు విదేశాలు తమ దేశాల్లో పెట్టుబడులు పెట్టే వారికి.. సంపద కొనుగోలు చేసే విదేశీయులకు శాశ్వత నివాస హక్కును కల్పిస్తుంటాయి. బహ్రెయిన్ విషయానికే వస్తే స్థిరాస్తుల్లో మన రూపాయిల్లో రూ.1.15 కోట్లు.. వ్యాపారాల్లో రూ.2.30కోట్లు పెట్టుబడి పెడితే శాశ్విత నివాస హక్కును ఇస్తాయి. ఇక్కడ ఎంత సంపాదించినా ఆదాయపన్ను చెల్లించాల్సి ఉండదు. అంతేనా.. విద్య.. వైద్యం.. ఇంటి వసతి.. పెద్ద వయస్కులకు సామాజిక భద్రత.. అంగవైకల్యం లేదంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడే వారికి పునరావాసం లాంటి సౌకర్యాల్ని పూర్తిగా ఉచితంగా కల్పిస్తాయి.
ఆదాయపన్ను లేని మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా.. ఇక్కడో దేశం గురించి మాత్రం తప్పక ప్రస్తావించాలి. నరకానికి నకలుగా.. విపరీతమైన ఆంక్షల్ని విధించే ఉత్తర కొరియాలోనూ ఆదాయపన్ను లేకపోవటం విశేషంగా చెప్పాలి. ఆదాయపన్ను మాత్రమే కాదు.. అన్ని రకాల పన్నుల్ని 1974లో రద్దు చేయటం గమనార్హం. ఏదైనా సందర్భంలో ప్రభుత్వం కోరుకుంటే మాత్రం పౌరులు ఉచితంగా సేవలు అందించాల్సి ఉంటుంది.
ఉత్తర కొరియాను వదిలేస్తే.. ఆదాయపన్ను వసూలు చేయని పలు దేశాల్లో పౌరుల సంక్షేమానికి పెద్ద పీట వేయటం కనిపిస్తుంది. ఇలాంటివి చాలానే దేశాల్లో ఉన్నాయి. ఈ దేశాలకు భిన్నంగా మన దగ్గర నిత్యం పన్నులు లాగేసి.. ఏడాదికి ఒకసారి ఆదాయపన్ను బాదేసిన తర్వాత కూడా విద్య.. వైద్యం లాంటి కనీస సౌకర్యాలకు భారీగా ఖర్చులు చేయాల్సి రావటం దేనికి నిదర్శనం? ఆదాయపన్నులే కాదు.. ఇతర పన్నుల వడ్డింపు విషయంలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది.