‘కొత్త సీసాలో పాత సారా’... వైన్ షాప్ వద్ద సీపీఐ నారాయణ గ్రౌండ్ రిపోర్ట్!

తాజాగా ఏపీలో లిక్కర్ షాపులను సందర్శించారు సీపీఐ నేత నారాయణ. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-18 06:42 GMT

ఆంధ్రప్రదేశ్ లో పాత లిక్కర్ పాలసీని రద్దు చేసిన కూటమి ప్రభుత్వం.. సరికొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాలను ప్రవేటు వ్యక్తులకు లాటరీ పద్దతిలో అప్పగించింది. ఇదే సమయంలో... గత ప్రభుత్వ హయాంలో కనిపించని బ్రాండెడ్ మద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఇక క్వార్టర్ బాటిల్ రూ.99 కే అందిస్తామని చంద్రబాబు చెప్పారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల బ్రాండ్ లనూ తీసుకొచ్చారు. అయితే... గత ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలకే మద్యాన్ని అమ్ముతున్నారని.. ధరలు ఏమీ తగ్గలేదని మందుబాబులు మండిపడుతున్నారు!

కాకపోతే గత ప్రభుత్వ హయాంలో కనిపించిన కొన్ని బ్రాండ్లతో పాటు పాత బ్రాండెడ్ మద్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారని.. ధరల్లో మాత్రం మార్పులేదని చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఏపీలో లిక్కర్ షాపులను సందర్శించారు సీపీఐ నేత నారాయణ. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ అమలులోకి వచ్చిన నేపథ్యంలో మద్యం వ్యాపారం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. ఈ సమయంలో విజయవాడలోని ఓ మద్యం దుకాణం వద్ద ప్రత్యక్షమయ్యారు సీపీఐ నారాయణ. ఈ సమయంలో షాపులోని వ్యక్తులతో రూ.99 మద్యం బాటిల్ అందుబాటులో లేకపోవడంపై వారిని ప్రశ్నించారు.

అనంతరం మాట్లాడిన నారాయణ... పాత ప్రభుత్వంలో అన్నీ కేంద్రీకరించి అవినీతి జరిగేదని.. ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ అనే స్టాండ్ తీసుకుందని అన్నారు. ఇందులో భాగంగా సరసమైన ధరలు, నాణ్యమైన సారాయి అని అన్నారని చెబుతూ.. సారాయే పనికిమాలినదని, ఇక ఇందులో నాణ్యమైనది ఏముందని ఆయన ప్రశ్నించారు.

మద్యం వ్యాపారాన్ని ఆదాయ వనరుగా చూపించి సంతోషపడిపోతున్నారని.. ఇందులో భాగంగా అప్లికేషన్స్ లోనే రూ.3000 కోట్లు వచ్చాయని.. డిపాజిట్లలో రూ.3000 కోట్లు వస్తాయని చెబుతున్నారని అన్నారు. ఇక ఇందులో సెజ్ పన్ను పై ఆదాయం వస్తుందని, దాన్ని రీహెబిటేషన్ సెంటర్ కు కేటాయిస్తామని చెబుతున్నారని గుర్తు చేశారు.

అంటే... బాగా తాగించి, దానికి బానిసైన వాడికి మందులు ఇచ్చి తాగుడు మానిపించే పని ఇది అని ఎద్దేవా చేశారు. ఇదంతా... అడుసు తొక్కనేల, కాలు కడుగనేల అన్నట్లుగా ఉందని తెలిపారు. ఇదంతా తలతిక్క పనితప్ప మరొకటి కాదని. ఒక్కమాటలో చెప్పాలంటే... ఈ నూతన మద్యం పాలసీ... ‘కొత్త సీసాలో పాత సారా’ మాదిరిగా ఉందని నారాయణ క్లారిటీ ఇచ్చారు!!

Tags:    

Similar News