హైదరాబాద్ బ్యాంక్ నుంచి రూ.175 కోట్లు విదేశీ ఖాతాల్లోకి!

విన్నంతనే మైండ్ బ్లాక్ అయ్యే సైబర్ మోసం ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

Update: 2024-08-26 04:36 GMT

విన్నంతనే మైండ్ బ్లాక్ అయ్యే సైబర్ మోసం ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించిన హైదరాబాద్ పోలీసులు ఫోకస్ చేసి.. సేకరించిన సమాచారాన్ని మరింత లోతుల్లోకి వెళ్లి చూస్తే.. షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ పాతబస్తీలోని ఒక బ్యాంకును బురిడీ కొట్టించి ఏకంగా రూ.175 కోట్ల మొత్తాన్ని కొల్లగొట్టిన వైనం బయటకు వచ్చింది.

ఈ మొత్తం పనిని ఇద్దరు సైబర్ నేరగాళ్లు చేస్తే.. వారికి ఇద్దరు ఆటో డ్రైవర్లు సహకరించటం గమనార్హం. మోసంలో భాగంగా జాతీయ బ్యాంకులో ఆరు బ్యాంక్ అకౌంట్లను ఆటో డ్రైవర్ల చేత ఓపెన్ చేయించిన సైబర్ నేరగాళ్లు.. వారి ద్వారా ఏకంగా రూ.175 కోట్ల లావాదేవీల్నినిర్వహించారు. వేర్వేరు ప్రాంతాల్లో మోసం చేసిన మొత్తాల్ని హైదరాబాద్ లో తాము ఓపెన్ చేయించిన ఇద్దరు ఆటో డ్రైవర్ల అకౌంట్లలోకి వేసి.. వాటిని దుబాయ్.. ఇండోనేషియా.. కంబోడియాలకు నిధులు జారీ చేసినట్లుగా గుర్తించారు.

ఆ నిధులతో క్రిప్టో కరెన్సీగా మార్చేసిన వైనం వెలుగు చూసింది. సైబర్ నేరగాళ్లు ఇచ్చే చిల్లరకు ఆశ పడిన ఈ ఇద్దరు ఆటో డ్రైవర్లు.. వారు చెప్పినట్లుగా బ్యాంకు అకౌంట్లను ప్రారంభించటం ద్వారా.. వారి పనిని సులువు చేశారు. హవాలా.. మనీ లాండరింగ్ ద్వారా లావాదేవీల్ని జరిపిన సైబర్ నేరగాళ్లు 600 కంపెనీలకు అకౌంట్లను సైబర్ నేరగాళ్లకు లింక్ చేశారు. సైబర్ నేరగాళ్ల వెనుక చైనా కేటుగాళ్ల హస్తం ఉందని భావిస్తున్నారు. ఇంత భారీ నేరాలు జరగటానికి సహకరించిన ఇద్దరు ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో జరిగింది.

Tags:    

Similar News