చిన్నమ్మ పెద్ద డెడ్ లైన్.. 15 రోజుల్లోనే..!
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు.. దగ్గుబాటి పురందేశ్వరి.. ఉరఫ్ చిన్మమ్మ.. పార్టీ నాయకులకు పెద్ద డెడ్‌లైన్ పెట్టేశారు
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు.. దగ్గుబాటి పురందేశ్వరి.. ఉరఫ్ చిన్మమ్మ.. పార్టీ నాయకులకు పెద్ద డెడ్‌లైన్ పెట్టేశారు. మరో 15 రోజుల్లో క్షేత్రస్థాయిలో బీజేపీని భారీ ఎత్తున బలోపేతం చేయాలని అన్నారు. తన బాధ్యత ఇంతవరకేనని.. ప్రజలను కలుసుకోవాల్సిన అవసరం, బాధ్యత, కర్తవ్యం అన్నీ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులకే ఉన్నాయని తేల్చి చెప్పారు. అంతేకాదు.. రెండు బలమైన ప్రాంతీయ పార్టీలను ఢీ కొట్టేలా బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆమె నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తాజాగా అరకు పార్లమెంటు స్థానంలో పర్యటించిన పురందేశ్వరి ఇక్కడి నాయకులతో భేటీ అయ్యారు. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత తదితరులకు ఆమె దిశానిర్దేశం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, స్థానికంగా పోటీ చేసిన వారు కూడా అసలైన నాయకులని అన్నారు. ఎన్నికలు నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండు, లేదా మూడో వారంలో వస్తుందని చెబుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు కేవలం 15 నుంచి 20 రోజులు మాత్రమే సమయం ఉందని, ఈ లోగా పార్టీని రెండు ప్రాంతీయ పార్టీలను ఢీకొట్టేలా బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
బిజెపి కి ఓటు వేయిద్దామని సంకల్పం తీసుకుందామన్నారు. బిజెపి కీ ఓటు వేసిన కుటుంబాలతో స్థానిక నేతలు మమేకం కావాలని పిలుపునిచ్చారు. ''బిజెపి కార్యకర్తలు లో ధైర్యం వచ్చింది. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లో వైసీపీ నేతలను నిలువరించి బిజెపి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. అవసరమైతే.. ఘర్షణకు దిగాలి. లక్ష్యాలు సాధించాలి. ప్రభుత్వ అధికారులను నిలదీయాలి'' అని పురందేశ్వరి పిలుపు ఇచ్చారు
ఎన్నికలు సమయం ఆసన్నమైంది ఓట్లు ఎలా తెచ్చుకోవాలి అన్న అంశంపై దృష్టి సారించాలని పురందేశ్వరి చెప్పారు. బాధ్యతా స్థానంలో ఉన్న వారు తండ్రి స్థానం తీసుకుని కార్యకర్తలను ముందుకు నడిపించాలన్నారు. దొంగ ఓట్లను రద్దు చేయించాలని, దీనికి తన సహకారం కూడా ఉంటుందని పురందేశ్వరి తేల్చి చెప్పారు. మరి చిన్నమ్మ డెడ్‌లైన్ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.