దస్తగిరి తాజా వార్నింగ్ విన్నారా?

ముఖ్యమంత్రి జగన్ మీద పోటీ చేసేంత ధైర్యం దస్తగిరికి ఉందా? అని ప్రశ్నిస్తూ దాడి చేసిన ఉదంతంలో అతగాడు గాయపడ్డాడు

Update: 2024-03-09 12:26 GMT

వైఎస్ వివేకాను దారుణంగా హతమార్చిన ఉదంతంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొని.. అనూహ్యంగా అఫ్రూవర్ గా మారిన దస్తగిరి వ్యవహారం మొదట్నించి సంచలనమే. తాజాగా దస్తగిరి తండ్రి షేక్ హాజీవలిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి పులివెందుల సమీపంలోని నామాలగుండు వద్ద శివరాత్రి జాగరణ చేసేందుకు వెళ్లిన దస్తగిరి తండ్రిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మీద పోటీ చేసేంత ధైర్యం దస్తగిరికి ఉందా? అని ప్రశ్నిస్తూ దాడి చేసిన ఉదంతంలో అతగాడు గాయపడ్డాడు.

ఈ ఉదంతంపై పులివెందుల పోలీసులకు దస్తగిరి తండ్రి కంప్లైంట్ చేశారు. తాజాగా ఈ ఉదంతంపై దస్తగిరి స్పందించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పై బయట ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లుగా ఆరోపించారు. తాజా ఉదంతం నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలన్నారు. తాజాగా పులివెందులలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న దస్తగిరి మాట్లాడుతూ.. ఈ నెల 12న హైదరాబాద్ సీబీఐ కోర్టులో వాయిదా కోసం వెళుతున్నట్లుగా పేర్కొన్నారు.

పులివెందుల వైసీపీ నేతలకు దమ్ముంటే తనను టచ్ చేయాలన్న దస్తగిరి.. తన కుటుంబం జోలికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ప్రశ్నించారు. తన ఫ్యామిలీ జోలికి వచ్చారు కాబట్టే.. వార్ వన్ సైడ్ అవుతుందని.. తన తండ్రి మీద దాడి చేసినోళ్లను వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. దేనికైనా సిద్ధమన్న ఆయన.. ఢీ అంటే ఢీ అంటూ స్పష్టం చేశారు. తాను వెనక్కి తగ్గనని చెప్పిన దస్తగిరి వ్యాఖ్యలతో వాతావరణం మరింత వేడెక్కిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News