విషాదం: శబరిమల క్యూలైన్ లో కుప్పకూలిన బాలిక మృతి
దసరా మొదలుకొని జనవరి సంక్రాంతి వరకు అయ్యప్ప మాలను వేసుకునే లక్షలాది భక్తులు దేశంలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలకు రావటం తెలిసిందే.
వేలాదిగా తరలి వచ్చే భక్తజనం కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిన కేరళ ప్రభుత్వం మరోసారి తన చేతకానితనాన్ని ప్రదర్శించింది. అయ్యప్పస్వామి దర్శనానికి తమ రాష్ట్రానికి వచ్చే భక్తుల్ని.. భక్తుల మాదిరి కాకుండా టూరిస్టుల మాదిరి చూసినా వారి కోసం భారీగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. కానీ.. అదేమీ చేయని నిర్లక్ష్యం పదకొండేళ్ల బాలిక మరణానికి కారణమైంది. దసరా మొదలుకొని జనవరి సంక్రాంతి వరకు అయ్యప్ప మాలను వేసుకునే లక్షలాది భక్తులు దేశంలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలకు రావటం తెలిసిందే. ఈ సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాల్సిన కేరళ ప్రభుత్వం తరచూ వైఫ్యలం చెందటం తెలిసిందే.
మూడునాలుగేళ్లకు ఒకసారి భారీగా వచ్చే భక్తుల్ని కంట్రోల్ చేసే విషయంలో జరిగే పొరపాట్లు భక్తుల ప్రాణాల్ని తీసేలా మారుతుంటాయి. తాజాగా అలాంటిదే మరోసారి చోటుచేసుకుంది. ఈసారి శబరిమల కొండ మీద చోటు చేసుకున్న విషాదం అయ్యప్ప భక్తుల్ని ఆగ్రహానికి గురి చేసింది. స్వామి దర్శనానికి 18-24 గంటల సమయం పడుతున్న వేళ.. దర్శనం కోసం క్యూలైన్ లో నిలబడిన పదకొండేళ్ల బాలిక కుప్పకూలింది. ఆమెను ఆలయ అధికారులు హుటాహుటిన వైద్య సాయం కోసం తరలించారు.
అయితే.. అప్పటికే ఆమె ప్రాణాలు విడిచినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన ఈ బాలిక.. గడిచిన మూడేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం అయ్యప్ప భక్తుల ఆగ్రహానికి కారణమైంది. వారు అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ నిరసన తెలిపారు. భారీగా వచ్చే భక్తులకు తగ్గట్లు ఏర్పాట్లు చేయకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు. భారీగా తరలి వచ్చిన భక్తులతో ఎన్ని ఏర్పాట్లు చేసినా సరిపోవటం లేదని అధికారులు తమను తాము సమర్థించుకోవటం గమానార్హం.
తాజా ఉదంతంపై బీజేపీ యువమోర్చా నాయకులు కేరళలోని కమ్యునిస్టు ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. క్యూలైన్లలో కనీస సౌకర్యాల్ని సైతం కల్పించలేకపోతున్న వైనాన్ని ఎత్తి చూపుతూ మండిపడుతున్నారు. క్యూ లైన్ లో భారీగా నిలిచిన భక్తుల్ని క్లియర్ చేయాల్సిందిగా కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేయటం చూస్తే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. మరోవైపు.. భారీగా నెలకొన్న భక్తుల రద్దీతో పలువురు భక్తులు దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్న పరిస్థితి.
దర్శనం చేసుకోకుండా వెనుదిరుగుతున్న భక్తుల్లో ఎక్కువ మంది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు ఉండటం గమనార్హం. భారీగా భక్తులు రావటం.. వేలాది మందిని పంబ వద్దే నిలిపివేయటంతో.. కొండ మీద నుంచి దర్శనం లేకుండా తిరిగి వస్తున్న వారిని చూసి.. పరిస్థితిని అర్థం చేసుకొన్న కొందరు భక్తులు అక్కడి నుంచే వెనక్కివెళ్లిపోతుంటే.. మరికొందరు మాత్రం పైకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
పంబ వద్దే రెండు రోజులుగా కొండ మీదకు వెళ్లేందుకు వీలుగా ఎదురుచూస్తున్న భక్తులు వేలాదిగా ఉండటం చూస్తే.. రద్దీ ఎంత ఎక్కువగా ఉందో అర్థమవుతుంది. తాజా అంచనాల ప్రకారం నిత్యం 80 వేల నుంచి లక్ష మంది భక్తులు వెయిట్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కేరళ ప్రభుత్వం కళ్లు తెరిచి ఇప్పటికైనా పక్కాగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. తమ రాష్ట్రానికి వచ్చే లక్షలాది మంది భక్తులతో వందల కోట్ల ఆదాయం వస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదని మండిపడుతున్నారు.