రఘురామ కేసులో కీలక పరిణామం.. తులసిబాబు ప్రమేయం లేదా?

దీంతో రఘురామ గుండెపై కూర్చొని పిడిగుద్దులు గుద్దిన వారు ఎవరనే అనుమానం మళ్లీ మొదలైంది.

Update: 2025-01-22 05:39 GMT

డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కేసులో కీలక ట్విస్టు చేటుచేసుకుంది. రఘురామను కస్టోడియల్ టార్చర్ సమయంలో తాను లేనంటూ నిందితుడు, టీడీపీ నేత కామేపల్లి తులసిబాబు వాదిస్తున్నారు. దీంతో రఘురామ గుండెపై కూర్చొని పిడిగుద్దులు గుద్దిన వారు ఎవరనే అనుమానం మళ్లీ మొదలైంది. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నిందితుడు తులసిబాబు తన ఎత్తు, బరువు ఆధారంగా అపోహ పడుతున్నారని, రఘురామ ఆరోపణల్లో నిజం లేదని కోర్టుకు నివేదించారు.

డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఎంపీగా ఉన్నప్పుడు ఆయనపై రాజద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ సమయంలో రఘురామను కస్టోడియల్ టార్చర్ పెట్టారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది. ఒంగోలు ఎస్పీ దామోదర్ విచారణాధికారిగా వ్యవహరిస్తున్న ఈ కేసులో అప్పటి సీఐడీ ఏఎస్పీ విజయపాల్ ను ప్రధాన నిందితుడిగా ఆరోపిస్తూ అరెస్టు చేశారు. ఇక రఘురామ రాజు కస్టడీలో ఉండగా, ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చి దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఇలా ముసుగు ధరించిన వారిలో ఒకరు అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ప్రధాన అనుచరుడు కామేపల్లి తులసిబాబుగా రఘురామ ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేసిన విచారణాధికారి దామోదర్ జనవరి 8న నిందితుడు తులసిబాబును విచారించి అరెస్టు చేశారు.

అప్పటి నుంచి గుంటూరులోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తులసిబాబు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రఘురామపై దాడి చేసినట్లు తనను అనుమానిస్తూ అరెస్టు చేశారని, వాస్తవానికి తనకు ఈ కేసుకు సంబంధం లేదని తన లాయర్ల ద్వారా కోర్టుకు తెలిపారు. తన ఎత్తు, బరువును దృష్టిలో పెట్టుకుని అపోహ పడుతున్నారని కోర్టుకు నివేదించారు. రఘురామ కేసుతో తమ క్లెయింటుకు సంబంధం లేదని తులసిబాబు న్యాయవాదులు వాదించారు.

తులసిబాబు వాదన ప్రకారం కోర్టు విచారించి తగిన నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసులో తులసిబాబుకు వ్యతిరేకంగా పోలీసులు సమర్పించే ఆధారాలే కీలకంగా మారనున్నాయి. తులసిబాబు వాదనతో ఏకీభవించి కోర్టు బెయిల్ ఇస్తే.. కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉందంటున్నారు. తులసిబాబుకు బెయిల్ లభిస్తే రఘురామపై దాడి చేసిన ముసుగు వ్యక్తులు ఎవరన్న కోణంలో పోలీసులు మళ్లీ విచారించాల్సి ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News