పనికిరాని వాళ్లకి టికెట్‌ ..డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు కోవర్టులకు ఎమ్మెల్యే టికెట్లతో పాటు ఎమ్మెల్సీ ఇవ్వవద్దని జగన్‌ ను హెచ్చరించానని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

Update: 2024-01-08 09:43 GMT

టీడీపీ నుంచి వచ్చినవారికి టికెట్లు ఇవ్వవద్దని జగన్‌ కాళ్లు పట్టుకున్నా వినలేదని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోవర్టులు మన పార్టీలో ఉన్నారని.. వారికి టికెట్లు ఇవ్వవద్దని జగన్‌ కాళ్లు పట్టుకుని చెప్పానన్నారు. అయినప్పటికీ ఆయన వారికి సీట్లు ఇచ్చారని.. 23 మంది టీడీపీ కోవర్టులు వైసీపీలో గెలిచి టీడీపీలోకి ఫిరాయించారన్నారు. చంద్రబాబు కోవర్టులకు ఎమ్మెల్యే టికెట్లతోపాటు ఎమ్మెల్సీ ఇవ్వవద్దని జగన్‌ ను హెచ్చరించానని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

టికెట్‌ ఇచ్చేటప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ జాగ్రత్తగా ఇవ్వాలని సూచించారు. టీడీపీ నుండి వచ్చే పనికిరాని వాళ్లకి టికెట్‌ ఇస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ నుండి వస్తున్న వారి క్యారెక్టర్‌ చూసి టికెట్‌ ఇవ్వాలన్నారు.. అలా కాకుండా ఇస్తే.. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు అందుకే పార్టీ వదిలివెళ్లారన్నారు.

ఈ నేపథ్యంలో నారాయణస్వామి వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. వైఎస్‌ జగన్‌ తొలి విడత, మలి విడత మంత్రివర్గాల్లో చోటు దక్కించుకున్న మంత్రుల్లో నారాయణస్వామి ఒకరు. మొదటి నుంచి ఆయన డిప్యూటీ సీఎంగానే ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌ కు 70 ఏళ్లకు పైబడిన నారాయణస్వామి సాష్టాంగ నమస్కారం చేసిన సంగతి తెలిసిందే. ఇది వివాదాస్పదమైంది.

నారాయణస్వామి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ఆయనకు ఆయన భార్య భువనేశ్వరితో ప్రమాదం ఉందని హాట్‌ కామెంట్స్‌ చేశారు. పదవి కోసం చంద్రబాబుకు ఆమె విషం పెట్టినా పెట్టొచ్చన్నారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున మండిపడ్డారు.

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నారాయణస్వామి గెలుపొందారు. ఏపీ సీఎం జగన్‌ కు వీర విధేయుడుగా ముద్రపడ్డారు. వైఎస్‌ జగన్‌ తొలి కే బినెట్‌ లోనూ, మలి కేబినెట్‌ లోనూ నారాయణస్వామి డిప్యూటీ సీఎంగా పదవి దక్కించుకున్నారు. అంతేకాకుండా కీలకమైన ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ఉన్నారు.

నారాయణస్వామికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారు, చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో నారాయణస్వామికి టికెట్‌ రాదని టాక్‌ నడుస్తోంది.

కాగా వచ్చే ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి తనకు బదులుగా తన కుమార్తె కృపాలక్ష్మికి సీటు ఇవ్వాలని నారాయణస్వామి కోరుతున్నారు. ఈ విషయాన్ని వైసీపీ అధినేత జగన్‌ కు కూడా తెలియజేశారు. అయితే ఈ విషయంలో ఆయనకు ఎలాంటి హామీ రాలేదు.

Tags:    

Similar News