'ఉమా' ఫేడ్ అవుట్ అవుతున్నారా ..!
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు.. పేరు 2014-24 మధ్య బాగానే వినిపించింది.
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు.. పేరు 2014-24 మధ్య బాగానే వినిపించింది. అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, తర్వాత విపక్షం తరఫున బలమైన ఉద్యమాలు చేసిన నాయకుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. జగన్‌పైనా.. వైసీపీ నాయకులపైనా ఆయన `సైకో` అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత.. ఇది టీడీపీ నాయకులు అందిపుచ్చుకున్నారు. ఇక, వైసీపీ పాలనను అరాచక పాలన అని.. వ్యాఖ్యానించారు.
అదేవిధంగా అప్పటి మంత్రి కొడాలి నానీని బూతుల మంత్రి అని కూడా ఉమా వ్యాఖ్యానించారు. ఆ తర్వా తే.. ఈ వ్యాఖ్యలను టీడీపీ నాయకులు అందిపుచ్చుకుని ప్రచారంలోకి తెచ్చారు. ఈ పరిణామాలతో ఉమా పేరు మార్మోగింది. అయితే.. గత ఏడాది ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. చివరి నిముషం వరకు ఊగిసలాటే కొనసాగింది. ఆఖరుకు ఎలాంటి టికెట్ లేకుండా పోయింది. ఇక, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆయనకు ఏదో ఒక పదవి దక్కుతుందని అనుకున్నా.. అది కూడా చిక్కలేదు.
ఇవన్నీ ఇలా ఉంటే.. రెండు కీలక నియోజకవర్గాల్లో ఉమా పైచేయిగా మెలిగారు. ఇటు ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ.. నందిగామలో చక్రం తిప్పారు. అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా.. నందిగామపై తరచుగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఇక, తన సొంత నియోజకవర్గం మైలవరంలోనూ ఉమా.. పట్టు నిలుపుకొన్నారు. అయితే.. ఇవన్నీ.. గత ఎన్నికలకు ముందు వరకు మాత్రమే. తాజాగా ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఉమా పేరు వినిపించడం లేదు.
మైలవరంలో సహజంగానే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దూకుడు కనిపిస్తోంది. ఒకప్పుడు ఉమా వర్గంగా ఉన్న వారు ఇప్పుడు వసంత వెనుక తిరుగుతున్నారు. ఇక, నందిగామలో తంగిరాల సౌమ్య దూకుడు పెంచడం తెలిసిందే. స్థానిక ఎన్నికల్లో చైర్ పర్సన్ ఎన్నిక వ్యవహారంలో సౌమ్య తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి.. తన పట్టు చాటుకుంది. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ.. ఉమా పట్టు కోల్పోయారన్న చర్చ సాగుతోంది. పైగా ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడం లేదు. మరి మున్ముందు ఏమైనా పుంజుకుంటారేమో చూడాలి.