'ధరణి'కి బలిచేయద్దని మొత్తుకుంటున్నారా ?
ఈ సమావేశానికి రెవిన్యు శాఖలోని కీలకమైన అధికారులతో పాటు ధరణి పోర్టల్ ను నిర్వహించిన యంత్రాంగమంతా పాల్గొన్నది.
కేసీయార్ పాలనలో వివాదాస్పదమైన ధరణి పోర్టల్లో తప్పులకు తమను బాధ్యులను చేయద్దని కలెక్టర్లు ప్రభుత్వాన్ని బతిమలాడుకుంటున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోని కమిటీ తో కలెక్టర్లు సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి రెవిన్యు శాఖలోని కీలకమైన అధికారులతో పాటు ధరణి పోర్టల్ ను నిర్వహించిన యంత్రాంగమంతా పాల్గొన్నది. కేసీయార్ హయాంలో ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలపై అనేక ఫిర్యాదులున్నాయి. ఫిర్యాదులు రావటమే కాని కేసీయార్ ప్రభుత్వం ఏనాడూ వాటిని పట్టించుకోలేదట. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ధరణి పోర్టల్లో జరిగిన అవకతవకలు కూడా కారణమనే ప్రచారం తెలిసిందే.
పోర్టల్లోని లోపాలపై చర్చించి వీలైతే స్ట్రీమ్ లైన్ చేయటం లేకపోతే మొత్తానికే పోర్టల్ ను తీసేసి దానిస్ధానంలో కొత్త వ్యవస్ధను ఏర్పాటుచేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఎన్నికల సమయంలో అయితే అసలు ధరణి పోర్టల్ ను తీసేసి భూ భారతి అనే వ్యవస్ధను ఏర్పాటు చేస్తామని రేవంత్ పదేపదే చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు బయటపడాలంటే ఆ పోర్టల్ ను కొంతకాలం పాటు కంటిన్యూ చేయక తప్పదు.
అందుకనే పోర్టల్లో జరిగిన అవకతవకలపై చర్చించి సమస్యలకు పరిష్కారాలను కనుక్కునేందుకు రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి నేతృత్వంలో కమిటీ ని నియమించారు. ఆ కమిటి మొదటి సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి, సిద్ధిపేట, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ కలెక్టర్లు మాట్లాడుతు ధరణి పోర్టల్ లోపాలకు తమను బాధ్యులను చేయద్దని మంత్రికి విన్నవించుకున్నారు.
ధరణి పోర్టల్ కారణంగా భూయజమానులు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే అని కలెక్టర్లు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు అంగీకరించారు. అయితే వాటికి తాము బాధ్యులం కాదన్నారు. ధరణి వాస్తవ పరిస్ధితులను కలెక్టర్లు కమిటి దృష్టికి తెచ్చారు.
బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కూడా రంగారెడ్డి జిల్లాలోని చాలా చోట్ల ధరణి ద్వారా వందలాది ఎకరాలు యాజమాన్య హక్కులు మారిపోయినట్లు చాలా ఆరోపణలొచ్చాయి. వాటన్నింటిపైన కూడా కమిటీ చర్చిస్తోంది. మరి చివరకు ఏమి తేలుతుందో ? ఎవరు బాధ్యత వహిస్తారో చూడాలి.