వైసీపీకి ట్రబులిచ్చేలా ధర్మాన మాటలు
వాలంటీర్లే ఈసారి ప్రభుత్వాన్ని గెలిపించాలని ధర్మాన కోరుతున్నారు వారు ప్రతీ ఇంటికి వెళ్ళి పార్టీకి ఎవరు అనుకూలమో ఎవరు వ్యతిరేకమో తెలుసుకోవాలని ధర్మాన వారు సలహా ఇస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం మెద ఏపీలో ఏ ఒక్క విపక్షం సానుకూలంగా లేదన్న సంగతి అందరికీ తెలుసు. సింహం సింగిల్ అంటూ వైసీపీ ఒంటరిగా మారిపోయిందో లేక తన చర్యల ద్వారా విపక్షాలను ఏకం చేస్తోందో తెలియదు కానీ వైసీపీ ఒకటి ఒంటరి అంకెలా మారింది. ఆ పార్టీకి అన్ని వైపుల నుంచి విమర్శలే. అన్ని పక్షాలు విపక్షాలే.
ఇక ఇటీవల కాలంలో వాలంటీర్ల వ్యవస్థ మీద కూడా విపక్షాలు గట్టిగా మాట్లాడుతున్నాయి. వారిని ఒక అస్త్రంగా మార్చుకుంటునాయి. వాలంటీర్ల ద్వారా ప్రజల డేటా సేకరించి ఎక్కడికో పంపుతున్నారు అని నిన్నటికి నిన్ననే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెయ్యిన్నొకటోసారి నొక్కి వక్కాణించారు.
అలాగే టీడీపీ నాయకులు కూడా వాలంటీర్లు ఇళ్లలోకి వెళ్తున్నారు అంటూ అనేక రకాలుగా మాట్లాడిన వారే. ఈ నేపధ్యంలో నుంచి చూస్తే వాటిని తిప్పికొట్టడం కాదు, ఇంతకు ఇంతా జాగ్రత్తపడాల్సిన బాధ్యత వైసీపీ పెద్దలకు ఉంది. బాధ్యత గలిగిన మంత్రులకు కీలక నేతలకు ఉంది. కానీ అన్నీ తెలిసి ధర్మం చెప్పడంతో ధర్మరాజు అంతటి వారు అన్న పేరు తెచ్చుకున్న శ్రీకాకుళం జిల్లా మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే వైసీపీకి ట్రబుల్ ఇచ్చేలా మాట్లాడుతున్నారు.
ఆయన ఒక్కోసారి చేస్తున్న కామెంట్స్ సర్కార్ ని పూర్తిగా ఇరుకున పెడుతున్నాయి. ఆయన లేటెస్ట్ గా మాట్లాడిన మాటలు చూస్తే వాలంటీర్ల విషయంలో విపక్షాలు అంటున్నది అంతా నిజమే సుమా అనుకునేలా ఉన్నాయని అంటున్నారు. వాలంటీర్లే ఈసారి ప్రభుత్వాన్ని గెలిపించాలని ధర్మాన కోరుతున్నారు వారు ప్రతీ ఇంటికి వెళ్ళి పార్టీకి ఎవరు అనుకూలమో ఎవరు వ్యతిరేకమో తెలుసుకోవాలని ధర్మాన వారు సలహా ఇస్తున్నారు.
అంతే కాదు, ఆ డేటా అంతా పార్టీ వారికి ఇస్తే వారు పై వాళ్లకు పంపుతారు ఆ తరువాత ఏమి చేయాలో చేస్తారని ధర్మాన వారు అంటున్నారు. అంతే కాదు వాలంటీర్లు మళ్లీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తే వారికి తగిన ప్రతిఫలం జగన్ ఇస్తారని మాట్లాడుతున్నారు. ఇదంతా ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు, ఇంత అనుభవ శీలి అయి ఉండి ఎపుడేమి మాట్లాడో తెలిసిన వివేచనాపరుడు అయి ఉండి కూడా ధర్మాన వారు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.
పోనీ ఆయన ఏమైనా తక్కువ వారా అంటే మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వారు. వైఎస్సార్ జమానాలో ఆయనతో కలసి పనిచేసిన వారు. ఏ అంశం మీద అయినా పండిత పామరులకు సరిసమానంగా అర్ధం అయ్యేలా మాట్లాడడంలో ధర్మానది అందె వేసిన చేయి. అలాంటి పెద్ద మనిషి ఇలా మాట్లాడడమే విడ్డూరం అని అంటున్నారు.
ఆయన గతంలో కూడా విశాఖ ఒక్కటే రాజధాని, మూడు రాజధానులు అన్నవి లేనే లేవు అంటూ కాంట్రవర్సీగా మాట్లాడి అధినాయకత్వం కన్నెర్రకు కారణం అయ్యారని ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా పెద్ద వారు సీనియర్లు అయిన వారు పార్టీకి తలలో నాలుకగా ఉండాలి కానీ వారే ప్రత్యర్ధి పార్టీలకు ఉప్పందించే వారుగా ఉండరాదు అని అంటున్నారు. ధర్మాన వైఖరి చూస్తే వైసీపీకి బిగ్ ట్రబుల్స్ క్రియేట్ చేసేలా ఉన్నారే అని అంటున్నారు అంతా.