డీఎస్ పరిస్థితి విషమం!
కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు
కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల అనంతరం ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
కాగా 2004 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ (వైఎస్ రాజశేఖరరెడ్డి), డీఎస్ (డి.శ్రీనివాస్), ఎంఎస్ (ఎం.సత్యనారాయణరావు) పొడి అక్షరాల్లో బాగా పాపులర్. మీడియాలోనూ వైఎస్, డీఎస్, ఎంఎస్ మాట్లాడే మాటలకు మంచి ప్రాధాన్యత లభించేది.
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి, నిజామాబాద్ రూరల్ నుంచి ధర్మపురి శ్రీనివాస్ పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు డి. శ్రీనివాసే పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం వైఎస్సార్ తో ఆయన కూడా పోటీ పడ్డారు.
సాధారణంగా పీసీసీ అధ్యక్షులుగా ఎవరుంటే వారికే కాంగ్రెస్ లో నాడు ముఖ్యమంత్రి పదవి దక్కేది. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. వైఎస్సార్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంతో డీఎస్ నిరాశకు గురయ్యారు. అయితే ఆయనకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మంత్రివర్గంలో స్థానం దక్కింది. దీనిపైనా అప్పట్లో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ కలిపి ఉంటాయని.. కీలకమైన పంచాయతీరాజ్ శాఖను విడగొట్టి ఏ ప్రాధాన్యత లేని గ్రామీణాభివృద్ధి శాఖను తనకు అప్పగించారని డీఎస్ అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. ఇక 2009లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినా డీఎస్ నిజామాబాద్ రూరల్ లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
2009లో వైఎస్సార్ మరణానంతరం అధిష్టానానికి దగ్గరవాడైన డీఎస్ కే ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల్లో ఓడిపోవడం ఆయనకు ప్రతికూలమైంది. ఆ విషయంలో ఆయనను దురదృష్టం వెంటాడిందని చెబుతారు. కాపు సామాజికవర్గం కావడం, అందులోనూ బీసీ (మున్నూరు కాపు) కావడం, అధిష్టానానికి సన్నిహితుడు అవ్వడం, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇవ్వడం ఇలా అనేక కారణాలతో డీఎస్ కే సీఎం పదవి దక్కేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఎన్నికల్లో ఓడిపోవడంతో అవకాశం రాలేదు.
ఇక 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక డీఎస్.. టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బంగారు తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ లో చేరానని చెప్పుకొచ్చారు. ఆయనను కేసీఆర్ రాజ్యసభకు పంపారు. అయితే నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో 2019లో కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా గెలిచిన ధర్మపురి అరవింద్ స్వయానా డీఎస్ కుమారుడే కావడం గమనార్హం. దీంతో టీఆర్‌ఎస్ పార్టీకి, డీఎస్ కు మధ్య అగాధం ఏర్పడింది. ఆయన పార్టీకి దూరమయ్యారు. కాగా డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు.