జనసేనలో బాలినేని కీలక పదవి ?

ఆ తరువాత వైఎస్సార్ మరణానంతరం ఆయన వైసీపీ వైపుగా వచ్చారు.

Update: 2024-10-27 17:24 GMT

ఒంగోలు జిల్లాలో సీనియర్ మోస్ట్ నేతగా మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితాన్ని పండించుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేనలో చేరిపోవడం అనూహ్య పరిణామమే. ఎందుకంటే రాజకీయంగా చూస్తే ఆయనది కాంగ్రెస్ రక్తం. ఆయన 1989లో కాంగ్రెస్ ద్వారానే రాజకీయ అరంగేట్రం చేశారు.

ఆ తరువాత వైఎస్సార్ మరణానంతరం ఆయన వైసీపీ వైపుగా వచ్చారు. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి అందులో ఉన్నారు. ఆ పార్టీకి ఒంగోలులో పెద్ద దిక్కుగా నిలిచారు. వైసీపీ 2019లో అధికారంలోకి రావడానికి తనదైన కృషి చేశారు.

ఇక బాలినేనికి 2019లో మంత్రి పదవి దక్కింది. తొలి దఫాలో మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. అయితే మలి విడతలో ఆయనను తప్పించారు. దాంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురి అయ్యారు. అది కాస్తా ముదిరి పాకాన పడింది. ఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమి తరువాత కూడా అటూ ఇటూ సర్దుబాట అయితే పెద్దగా జరిగింది లేదు

దాంతో బాలినేని తనదైన రూట్ ఎంచుకున్నారు ఆయన జనసేనలో చేరిపోయారు. ఆయన ఆ పార్టీలో చేరి నెల రోజులు అయింది. బాలినేనికి జనసేనలో ఏ రకమైన గౌరవం దక్కుతుంది అన్నది అంతా చర్చించుకుంటున్న విషయంగా కూడా ఉంది.

అయితే ఆయన సేవలను చాలా పెద్ద ఎత్తున వాడుకోవాలని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు అని అంటున్నారు. ఆయన వల్ల గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఒక బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవచ్చునన్న ఆలోచనతోనే బాలినేనికి పెద్ద పీట వేయాలని నిర్ణయించారు అని అంటున్నారు

జనసేనలో బాలినేని సీనియారిటీకి అనుభవానికి తగిన పదవి రాష్ట్ర స్థాయిలోనే దక్కుతుందని ప్రచారం సాగుతోంది. ఆయన జగన్ కి దగ్గర బంధువు కూడా కావడంతో ముల్లుని ముల్లుతోనే అన్న యుద్ధ నీతిని అమలు చేసేందుకు కూడా వీలుగా ఆయన ప్రాధాన్యతను మరింత పెంచాలని చూస్తున్నారుట.

వైసీపీకి అండగా ఉండే ఒక బలమైన సామాజిక వర్గాన్ని తిప్పుకుంటే సీమ జిల్లాలలో జనసేన పటిష్టం అవుతుందని కూడా ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే బాలినేని రాకను టీడీపీ ఒంగోలు నేతలు వ్యతిరేకిస్తున్నారు.

అయితే జనసేన సొంత నిర్ణయం అది అని అంటున్నారు. తన పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి జనసేన ఎవరిని అయినా తీసుకుంటుందని అంటున్నారు. ఆ క్రమంలో బాలినేని వంటి సీనియర్ ని తీసుకోవడం ద్వారా పార్టీని పటిష్టం చేసుకోవాలని చూస్తున్నామని అంటున్నారు

ఇదిలా ఉంటే వైసీపీ ఇప్పటికే షర్మిల ఇష్యూతో ఇబ్బందులు పడుతోంది. సొంత చెల్లెలు విషయంలో వైసీపీ అధినాయకత్వం అన్యాయం చేసిందని కూడా టీడీపీ విమర్శలు చేస్తోంది. ఆ విధంగా వైసీపీని ఇరకాటంలో పెడుతున్నారు.

ఇది ఒక విధంగా వైసీపీని డీ మోరలైజ్ చేసేందుకు కూడా వాడుకుంటున్నారు. ఇపుడు బాలినేనికి పదవి ఇచ్చి ఆయనను కూడా ముందును పెట్టడం ద్వారా వైసీపీని మరింతగా ఇరకాటంలోకి నెట్టాలని కూటమి ప్లాన్ గా ఉందని అంటున్నారు. వైసీపీకి ఈ విధంగా ఊపిరి ఆడనీయకుండా చేయాలని చూస్తున్నారు. మొత్తానికి రాజకీయాలు అంటే కాదేదీ అనర్హం అన్నట్లుగా అన్నీ వాడుకుంటారు.

అయితే వీటిని వైసీపీ ఏ విధంగా తిప్పికొడుతుందో చూడాల్సి ఉంది. మరో వైపు బాలినేని జనసేనలో ఫుల్ యాక్టివ్ అయితే వైసీపీ నుంచి ఎంతమంది నేతలు ఆ వైపుగా జారిపోతారు అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News