బీజేపీ 'లక్ష్యం' మిస్ అయిందా... తెలంగాణ నేతలపై అధిష్టానం ఆగ్రహం
అయితే.. ఇచ్చిన టార్గెట్‌ను పూర్తిచేయడంలో రాష్ట్ర నేతలు విఫలం అవుతుండంతో అధిష్టానం వారిపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ సారి పలు ప్రయోగాలతో అధికారాన్ని దక్కించుకోలేకపోయిన కమలం పార్టీ.. వచ్చే 2028 ఎన్నికల్లో అయినా గెలిచి రాష్ట్రంలో కాషాయం జెండా ఎగురవేయాలని ఉవ్విల్లూరుతోంది. అదే టార్గెట్‌తో ముందుకెళ్తోంది. అయితే.. ఇచ్చిన టార్గెట్‌ను పూర్తిచేయడంలో రాష్ట్ర నేతలు విఫలం అవుతుండంతో అధిష్టానం వారిపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రత్యేక ఫోకస్ చేసిన బీజేపీ అధిష్టానం ఇక్కడ సభ్యత్వ నమోదును చాలెంజ్‌గా తీసుకుంది. ఇందుకోసం తెలంగాణ నేతలకు 50 లక్షల సభ్యత్వాలు చేయించాలని టార్గెట్ పెట్టింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందడం.. పార్లమెంటు ఎన్నికల్లోనూ 8 మంది ఎంపీలు గెలుపొందడంతో ఆ పార్టీకి ఊపు తెచ్చింది. అంతేకాకుండా దాదాపు 37 లక్షల పైచిలుకు ఓట్లు సాధించింది. దాంతో 50 లక్షల సభ్యత్వ నమోదు టార్గెట్‌ను విధించింది.
కానీ.. పార్లమెంట్ ఎన్నికల తరువాత అనుకున్న స్థాయిలో రాష్ట్రంలో బీజేపీ యాక్టివిటీ కనిపించడం లేదు. ఎన్నికల వేళ వచ్చిన ఊపు ఇప్పుడు కొంచెం కూడా ప్రజల్లో కనిపించడం లేదు. దాంతో హైకమాండ్ ఇచ్చిన లక్ష్యా్ని రాష్ట్ర నాయకత్వం చేరుకోలేకపోతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొదట్లో అందరూ ముందుపడి హుషారుగానే మెంబర్ షిప్ డ్రైవ్‌ను ప్రారంభించారు. ఆ తరువాత తరువాత నాయకుల నుంచి సపోర్టు పెద్దగా లభించలేదు. అందులోనూ పార్టీలో గ్రూపుల రాజకీయాలు ఉండడంతో లక్ష్యం కాస్త మరింత వెనక్కి నెట్టివేయబడింది. సీనియర్ నేతలు కూడా సభ్యత్వ నమోదును సీరియస్‌గా తీసుకోవడం లేదన్న అపవాదు కూడా ఉంది. అందుకే కింది స్థాయి లీడర్లు సైతం పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో సెప్టెంబర్ 8 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. ఇందుకోసం రాష్ట్రనాయకత్వం అన్ని జిల్లాలకు ప్రభారీలను నియమించింది. వారిలో కొంత మంది ప్రభారీలు సభ్యత్వ నమోదును పట్టించుకోవడం లేదనే టాక్ ఉంది. పట్టించుకున్నా కొన్నిచోట్ల కేడర్ వారి మాట వినడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అందుకే.. 50 లక్షల లక్ష్యం ఉంటే.. ఇప్పటికి కేవలం 20 లక్షలు మాత్రమే పూర్తి చేశారు. గడువు పొడగించినప్పటికీ సగం టార్గెట్ కూడా పూర్తికాలేదు. దీంతో రాష్ట్ర నాయకత్వంపై పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. అందులో భాగంగానే గత నెల బీజేపీ చీఫ్ నడ్డా సైతం రాష్ట్రానికి వచ్చారు. మరో 15 రోజులపాటు డెడ్‌లైన్ విధించారు. ఈ నెల 24వ తేదీలోపు లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే.. చీఫ్ పెట్టిన గడువు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఇన్ని రోజుల్లో పూర్తికాని లక్ష్యం ఈ వారం రోజుల్లో ఎలా కంప్లీట్ చేస్తారని ఆసక్తికరంగా మారింది. కేవలం వారం రోజుల్లోనే 30 లక్షల సభ్యత్వాలను చేరుకుంటారా అనేది చూడాలి.