మార్కెట్ పడింది.. డీమార్టు షేర్ మెరిసింది

గురువారం భారీ లాభాలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. శుక్రవారం మాత్రం అందుకు భిన్నంగా భారీ నష్టాల్లో ముగిశాయి.

Update: 2025-01-03 13:06 GMT

ఈ రోజు స్టాక్ మార్కెట్ లో రెండు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గురువారం భారీ లాభాలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. శుక్రవారం మాత్రం అందుకు భిన్నంగా భారీ నష్టాల్లో ముగిశాయి. గురువారం దాదాపు 2 శాతం మేర లాభ పడిన సూచీలు.. ఈ రోజు అందుకు భిన్నంగా నష్టాల బాట పడ్డాయి. కారణం.. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగటమే కారణం.

ఈ రోజు సూచీలు నేల చూపులు చూడటానికి కారణాల్లో ముఖ్యంగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి ప్రధాన షేర్లు భారీగా అమ్మకాలకు దిగటంతో సూచీలు పడ్డాయి. సెన్సెక్స్ 700పాయింట్లకు పైనే డౌన్ అయితే.. నిఫ్టీ 207 పాయింట్ల చొప్పున నష్టపోయింది. ఈ రోజు మార్కెట్ డౌన్ కు కారణాల్ని చూస్తే.. బ్యాంకింగ్.. ఫైనాన్షియల్ ఐటీ రంగాల స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి సూచీల పతకానికి కారణమైంది. దీంతో.. ఆయా రంగాల షేర్లు ఒక శాతం నష్టపోయాయి. ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టే రోజు దగ్గరకు వస్తున్న కొద్దీ కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉందని భావిస్తూ మదుపర్లు అప్రమత్తతో ఉండటం కూడా మార్కెట్ డౌన్ కు కారణమని భావిస్తున్నారు.

మార్కెట్ పరిస్థితి ఇలా ఉంటే.. ఒక షేర్ మాత్రం మార్కెట్ లో మెరుపులు మెరిపించింది. అదే.. డీమార్ట్. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చైన్ షాపుల్ని నడిపే రిటైల్ వ్యాపారాన్ని నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ షేర్లు ఈ రోజు భారీగా రాణించాయి. బీఎస్ఈలో ఒక్కో షేరు 15 శాతం పెరిగి రూ.4160 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. దీనికి కారణం లేకపోలేదు. మూడో త్రైమాసికానికి సంబంధించి తమ కంపెనీ సాధించిన వ్రద్ధి వివరాల్ని డీమార్ట్ గురువారం విడుదల చేసింది.

అయితే.. ఈ నివేదిక గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత విడుదల కావటంతో.. దాని ఎఫెక్టు శుక్రవారం ట్రేడింగ్ మీద పడింది. స్టాండ్ లోన్ పద్దతిలో సంస్థ ఆదాయం రూ.15,565.23కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయానికి నమోదైన రూ.13,247.33 కోట్లతో పోలిస్తే 17.4 శాతం పెరగటం గమనార్హం. దీనికి తోడు బ్రోకరేజీ సంస్థల అంచనాలు స్టాక్ కొనుగోళ్ల మద్దతుకు కారణమైంది. దీంతో.. ఓవైపు మార్కెట్ డౌన్ అవుతున్నా.. డీమార్ట్ షేర్లు మాత్రం దూసుకెళ్లాయి. షేర్ మార్కెట్ లో షేర్లు పెద్ద ఎత్తున రాణించటంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.2,67,386.22కోట్లకు చేరింది.

Tags:    

Similar News