వైసీపీ క్యాడర్ కి గుడ్ బుక్స్ కాదు గుడ్ లుక్స్ కావాలి!

నిజానికి వైసీపీలో క్యాడర్ ఇంతటి సుదీర్ఘమైన నిరీక్షణలను ఎన్నోసార్లు చూసి వగచి వేసారిపోయారు.

Update: 2024-10-11 07:30 GMT

వైసీపీ అధినేత జగన్ క్యాడర్ కి మంచి చేస్తామని చెబుతున్నారు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అంటున్నారు. అయితే ఆ మంచి కాలానికి సరిగ్గా అయిదేళ్లు సుదీర్ఘ నిరీక్షణ ఉంది. నిజానికి వైసీపీలో క్యాడర్ ఇంతటి సుదీర్ఘమైన నిరీక్షణలను ఎన్నోసార్లు చూసి వగచి వేసారిపోయారు.

ఒక విధంగా చెప్పాలీ అంటే 2009 నుంచి వారు జగన్ వెంటనే ఉన్నారు. అలా 2014లో వైసీపీ అధికారంలోకి వస్తుందని రావాలని ఒళ్ళూ ఇలూ గుల్ల చేసుకుని పనిచేశారు. దాని ఫలితమే వైసీపీ అధికారానికి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఇక 2014 నుంచి 2019 దాకా పనిచేయడం మరో ఎత్తుగా సాగింది.

ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం ఎన్ని అవరోధాలు పెట్టినా నిర్బంధాలు పెట్టినా జగన్ సీఎం కావాలని అహర్నిశలూ పనిచేశారు. అలా 2019లో వైసీపీని బంపర్ మెజారిటీతో గెలిపించారు. అంటే అప్పటికే పదేళ్ళ పాటు వనవాసాలు కష్టాలు కడగండ్లూ అన్నీ వైసీపీ కేడర్ పూర్తిగా చూసేసింది.

అయితే అయిదేళ్ళ వైసీపీ పాలనలో ఎక్కడో నుంచి వచ్చిన వాలంటీర్లకు ప్రాధాన్యత దక్కింది కానీ అసలు సిసలు క్యాడర్ కి మాత్రం ఏమీ లభించలేదు దాంతో వారు పూర్తిగా డీలా పడ్డారు, నిండా నిరాశ చెందారు అలా సైలెంట్ అయ్యారు. దాని ఫలితమే 2024లో వైసీపీని దారుణంగా దెబ్బ కొట్టింది. బొక్క బోర్లా పడి ఎలెవెన్ వైసీపీగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కి పని చెబుతోంది

ఇక ఓటమి చెందాక తాపీగా వైసీపీ అధినాయకత్వం మదిలో మెదిలిన ఆలోచన ఏమిటి అంటే క్యాడర్ నీరసించడం వల్లనే ఓటమి ఈ స్థాయిలో దారుణంగా పలకారించింది అని. దాంతో జగన్ క్యాడర్ ని బాగా చూసుకుంటామని ఒకటికి పదిసార్లు మీటింగులలో చెబుతున్నారు. తాజాగా ఆయన వైసీపీలో పనిచేసే మంచి వారి పేర్లను రాసుకుంటామని గుడ్ బుక్ లో అలా లిస్ట్ తయారు చేసి 2029లో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు.

ఈ హామీ బాగానే ఉంది కానీ ఇప్పటికే పదేళ్ల పాటు పనిచేసి క్యాడర్ పూర్తిగా అలసిపోయింది అని అంటున్నారు 2029 చాలా దూరం ఉంది. అప్పటికి రాజు ఎవరో మంత్రి ఎవరో అన్నది కూడా ఆలోచించాలి కదా అంటున్నారు. తీరా మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చినా క్యాడర్ ని పట్టించుకుంటారా అన్న డౌట్లు అయితే ఉండనే ఉన్నాయి అంటున్నారు.

అందుకే జగన్ మాటలతో కాకుండా చేతలకు పని చెప్పి వైసీపీలో బాగా పనిచేసిన వారిని మండలానికి నియోజకవర్గానికి ఇంతమందిని అని గుర్తించి వారికి ఆ చేసే మంచి ఏదో ఇపుడే చేస్తే వారిని చూసి మిగిలిన వారిలో ఆశ పుడుతుంది. పార్టీ పట్ల మరింత నమ్మకం కుదురుతుంది. దాంతో వారే ఎవరూ చెప్పకుండానే రేసు గుర్రాల మాదిరిగా రంగంలోకి దిగి పార్టీని క్షేత్ర స్థాయిలో గట్టిగా నిలబెడతారు అని అంటున్నారు.

వైసీపీ క్యాడర్ పరిస్థితి ఏమీ బాగాలేదని కూడా అంటున్నారు పదవులు పొందిన వారు మాజీలు అయినా అయిదేళ్ళ పాటు హ్యాపీగానే ఉంటారని ఏ పదవీ లేక కనీసం ఏ చాన్స్ రాక గత దశాబ్దన్నరగా కష్టించి పనిచేస్తున్న క్యాడర్ ని విపక్షంలో ఉన్నపుడు అయినా మంచిగా చూసుకుంటే వారే రేపటి పార్టీ విజయానికి సారధులు అవుతారు కదా అని అంటున్నారు. మరి వైసీపీ హై కమాండ్ క్యాడర్ విషయంలో గుడ్ బుక్ ని నమ్ముకుంటుందా లేక వారి గుడ్ లుక్స్ లో పడేందుకు యాక్షన్ ప్లాన్ ని తయారు చేసుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News