గులాబీలపై పోలీసులు ఫోకస్ పెట్టారా ?
తన తండ్రి ఒక చెరువును చెరపట్టి సొంతం చేసేసుకున్నారని ముత్తిరెడ్డి కూతురు ఫిర్యాదుచేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
గులాబీ నేతలపై పోలీసులు ఫోకస్ పెట్టినట్లే ఉన్నారు. కేసీయార్ పదేళ్ళ పాలనలో గులాబీ పార్టీ నేతలు చాలమంది భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అయితే కొందరు మంత్రులు, ఎంఎల్ఏలు చెరువులు, కుంటలను కూడా వదిలిపెట్టలేదు. ఏదో రూపంలో అధికారులను మ్యానేజ్ చేసుకుని బినామీల పేర్లతో రాయించేసుకున్నారు. భూకబ్జాపై ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆయన కూతురు స్వయంగా ఫిర్యాదు చేయటం అప్పట్లో సంచలనమైంది. తన తండ్రి ఒక చెరువును చెరపట్టి సొంతం చేసేసుకున్నారని ముత్తిరెడ్డి కూతురు ఫిర్యాదుచేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జాలుచేసిన మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు ఇంకా చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్ళపై ఇపుడు పోలీసులు కేసులు బుక్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీమంత్రి మల్లారెడ్డి పైన శామీర్ పేట పోలీసులు కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. శామీర్ పేటలో మల్లారెడ్డి ఏకంగా 40 ఎకరాలను కబ్జాచేసి సొంతం చేసేసుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. భూ యజమానులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదుచేశారు.
తాజాగా మరో ఎంఎల్ఏ మీద ఇలాంటి కేసునే పోలీసులు నమోదుచేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో 2,185 చదరపు మీటర్ల స్ధలాన్ని పాలేరు మాజీ ఎంఎల్ఏ కందాళం ఉపేందర్ రెడ్డి కబ్జాచేశారని పోలీసులు కేసు నమోదుచేశారు. ఎంఎల్ఏ కబ్జాచేసిన స్ధలం ప్రభుత్వానిదేనట. షేక్ పేట్ ఎంఆర్వో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఉపేందర్ రెడ్డిపైన పోలీసులు కేసు నమోదుచేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయలు విలువచేసే భూములు చాలా ఉన్నాయి.
ఇందులో ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములతో పాటు ప్రైవేటు వ్యక్తులతో వివాదాల్లో ఉన్న ప్రభుత్వ భూములు, కోర్టు కేసుల్లో ఇరుక్కున్న ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిపైన మాజీమంత్రులు, మాజీ ఎంఎల్ఏలు దృష్టిపెట్టి ఏదోరకంగా సొంతం చేసేసుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. పదేళ్ళు అధికారంలో ఉన్నకారణంగా కబ్జాదారులకు ఎదురులేకుండా పోయింది. అలాంటి ఆరోపణలు, ఫిర్యాదులపై ఇపుడు పోలీసులు దృష్టిపెట్టారు. ఫిర్యాదులన్నింటినీ ఒక్కోటిగా విచారించి బాధ్యులపైన కేసులు నమోదుచేస్తున్నారు. ఇంకెంతమంది గులాబీ మాజీలు బయటపడతారో చూడాలి.