ఉదయ్ పుర్ ప్యాలెస్ లో "మహారాజు"కు నో ఎంట్రీ... అసలేం జరిగింది?

ఈ సమయంలో దాయాదుల మధ్య పోరు తీవ్రరూపం దాల్చడం, ఆలయ ప్రవేశాలను అడ్డుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.

Update: 2024-11-26 07:43 GMT

రాజస్థాన్ లోని ఉదయ్ పుర్ రాజవంశంలో కొత్త మహారాజు పట్టాభిషేకం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ సమయంలో దాయాదుల మధ్య పోరు తీవ్రరూపం దాల్చడం, ఆలయ ప్రవేశాలను అడ్డుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా పట్టాభిషేకం చేసిన వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే కావడం గమనార్హం.

అవును... ఉదయ్ పుర్ రాజవంశంలో మేవాడ్ 77వ మహారాజుగా బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ సోమవారం పట్టాభిషేకం చేశారు. అయితే... ఆయనను, ఆయన అనుచరులను ఉదయ్ పుర్ ప్యాలెస్ లోకి అడుగుపెట్టకుండా రాజకుంటుంబంలోని దాయాదులు అడ్డుకున్నారు. దీంతో... వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... రాజ్ పుత్ రాజు మహారాణా ప్రతాప్ కు మహేంద్ర సింగ్ మేవాడ్, అరవింద్ సింగ్ మేవాడ్ లు వారసులు. ఈ క్రమంలో మేవాడ్ రాజ్య 76వ మహరాజుగా ఉన్న మహేంద్ర సింగ్ మేవాడ్ ఇటీవల కన్నుమూశారు. దీంతో.. ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవాడ్ 77వ మహారాజుగా పట్టాభిషేకం చేశారు.

ఈ పట్టాభిషేక కార్యక్రమం అనంతరం సంప్రదాయం ప్రకరం.. ఆ రాజవంశ కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్ పుర్ లోని సిటీ ప్యాలెస్ ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంది. అయితే... దీనికి అరవింద్ సింగ్ మేవాడ్ అడ్డు చెప్పారు. ఉదయ్ పుర్ లోని రాజ కుటుంబానికి చెందిన ట్రస్ట్ కు ఛైర్మన్ ఉన్న ఆయన నియంత్రణలోనే ఏకలింగనాథ్ ఆలయం, ప్యాలెస్ లు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో... విశ్వరాజ్ సింగ్ ను కోటలోకి రానివ్వబోమంటూ అరవింద్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. కొత్త రాజుకు వ్యతిరేకంగా ఓ ప్రకటన ఇచ్చారు. దీంతో పరిస్థితులు వేడెక్కాయని అంటున్నారు. ఈ సమయంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా... పోలీసులు భారీగా ప్యాలెస్ వద్ద మొహరించారు.

ఈ సమయంలో సోమవారం రాత్రి కొత్త మహారాజు విశ్వరాజ్ సింగ్.. తన మద్దతుదారులతో కలిసి ప్యాలెస్ వద్దకు వెళ్లారు. కానీ.. అరవింద్ సింగ్ కుమారుడు, ఆయన మద్దతుదారులు వీరిని లోనికి రాకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సమయంలో పలువురు గాయపడ్డారు. ఈ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News