ఢిల్లీలో మోడీ ఇంట రామజ్యోతిని చూశారా?

అవును... అయోధ్యలో బాల రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి నేతృత్వం వహించిన ప్రధాని మోడీ సమక్షంలో విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది.

Update: 2024-01-22 18:22 GMT

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా, వైభవోపేతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. సుమారు ఐదు వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ అయోధ్యాపురిలో శ్రీరాముని దర్శనభాగ్యం సాక్షాత్కారమైంది. ఇందులో భాగంగా... సోమవారం మధ్యాహ్నం 12:29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య ఉండే 84 సెకండ్ల దివ్య ముహూర్తంలో రామ్‌ లల్లాను ప్రధాని కొలువుదీర్చారు.


అవును... అయోధ్యలో బాల రాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి నేతృత్వం వహించిన ప్రధాని మోడీ సమక్షంలో విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని వేల మంది ప్రత్యక్షంగా, కోట్ల మంది పరోక్షంగా తిలకించారు. ఈ సందర్భంగా... ప్రధానమంత్రి మోడీ శ్రీరాముని ఎదుట "సాష్టాంగ నమస్కారం" చేశారు. ఇదే సమయంలో... "సాధువుల" నుండి ఆశీర్వాదం కూడా కోరారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.


ఇదే సమయంలో... అయోధ్యలో రామ్‌ లల్లా ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మోడీ తన ఉపవాసాన్ని విరమించారు. ఇందులో భాగంగా... ఈ క్రతువు కోసం 11 రోజుల నుంచి ఆయన ఉపవాస నియమాలను పాటిస్తున్న ఆయనకు... నేడు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యుడు గోవింద్‌ దేవ్‌ గిరి మహారాజ్‌.. "చరణామృత్‌" తాగించి దీక్షను విరమింపచేశారు. ఈ 11 రోజులూ మోడీ నేలపై పడుకుని, కొబ్బరి నీళ్లు తాగుతూ, రాముడితో అనుబంధం ఉన్న క్షేత్రాలన్నీ సందర్శించారు.


మరోపక్క అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకను పురస్కరించుకుని రాత్రికి ఇళ్లలో దీపాలు వెలిగించాలని.. దీన్ని దీపావళి పండగలా చేసుకోవాలని ప్రధాన మంత్రి మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో మోడీ.. దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా రామ్‌ లల్లా చిత్రపటానికి హారతి ఇచ్చారు. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.


కాగా... అంగరంగ వైభవంగా జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు రెండు గంటల పాటు మంగళ వాయిద్యాలు మోగించగ.. వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7 వేల మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పుష్పవర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News