దుమ్ములేపుతున్న డిజిటల్ ప్రచారం... ఖర్చు తెలిస్తే షాకే!

ఇక్కడ తమ గురించి తాము గొప్పగా చెప్పుకోవడం ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థులను అదేస్థాయిలో విమర్శించడం కూడా అంతే ముఖ్యం

Update: 2023-11-20 05:43 GMT

కాలం ఎప్పుడో మారిపోయింది! ఒకప్పుడు ఎన్నికల ప్రచారాలు అంటే కరపత్రాలు, వాల్ పోస్టర్లు, పబ్లిక్ మీటింగ్ లు! తర్వాత పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు! ఇప్పుడు వాటితోపాటు సోషల్ మీడియా క్యాంపెయిన్స్ వెరసి... డిజిటల్ ప్రచారం దుమ్ములేపుతుంది! మొబైల్ ఆన్ చేస్తే వీడియో, బ్రౌజింగ్ స్టార్ట్ చేస్తే ఫోటో, టీవీ ఆన్ చేస్తే బైట్ లు, రేడియో ఆన్ చేస్తే స్లోగన్లు!

అవును... రాష్ట్రంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. డిజిటల్‌ యుగంలో టెక్నాలజీని ఉపయోగించుకుని అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకేళ్లేందుకు బీఆరెస్స్ కృషి చేస్తుంటే.. పదేళ్ల ప్రభుత్వ వైఫల్యాలు ఇవి అని చెబుతూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలా అన్ని పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి.

ఇక్కడ తమ గురించి తాము గొప్పగా చెప్పుకోవడం ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థులను అదేస్థాయిలో విమర్శించడం కూడా అంతే ముఖ్యం. ఈ సమయంలో గత వారం రోజులుగా ఈ వీడియోలను ఇంటర్నెట్‌ లో ప్రసారం చేయడానికి ఆయా రాజకీయ పార్టీలు భారీగా ఖర్చు చేశాయి. పైగా ఎన్నికల విషయంలో ఖర్చుకు ఏమాత్రం వెనకడుగువేయని రోజులు కావడంతో... ఈ లెక్క విషయమంలో తగ్గేదేలే అని అంటున్నాయి పార్టీలు!

ఈ విషయంలో అధికార బీఆరెస్స్ దూకుడు మీదుంది. ఇందులో భాగంగా ఈ డిజిటల్ ప్రసారాల కోసం అత్యధికంగా రూ. 2,45,09,000 ఖర్చు చేసింది. మరోపక్క విపక్షాలు కూడా తామేమీ తీసిపోలేదన్నట్లుగా ఖర్చు చేశాయి. ఇందులో భాగంగా.. కాంగ్రెస్ రూ. 1,88,54,000 ఖర్చు చేయగా, బీజేపీ కేవలం రూ. 7,84,500 ఖర్చు చేసింది.

వాస్తవానికి డిజిటల్ ప్రచారాల విషయంలో బీజేపీ ఫస్ట్ లో ఉంటుందీ అని అంటారు. ఆ టైంపులో ఆన్ లైన్ లో అద్భుత ప్రచారాలు చేయడంలో ఆ పార్టీ దిట్ట అని చెబుతారు. అయితే... ఊహించని రీతిలో తెలంగాణ ఎన్నికల్లో డిజిటల్ క్యాంపెయిన్ విషయంలో ఆ పార్టీ మూడోస్థానానికి పరిమితమైపోయింది.

మరి ఎవరిస్థాయిలో వారు.. ఎవరి వ్యూహాలతో వారు భారీ ఎత్తున చేస్తున్న ఈ డిజిటల్ ప్రసారాలు ఎవరికి ఎలాంటి సత్ఫలితాలు ఇస్తాయనేది వేచి చూడాలి.

Tags:    

Similar News