చ‌రిత్ర సృష్టించాల‌నుకుంటున్న కేసీఆర్ ఫెయిల‌వుతోంది ఇక్క‌డే

ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తున్నారని డీకే అరుణ అన్నారు. రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు నిధులను కమిషన్ల రూపంలో కాజేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు.

Update: 2023-09-15 00:30 GMT

తెలంగాణ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ర‌థసార‌థి కేసీఆర్ ప‌రిపాల‌న నిర్ణ‌యాలు, రాజ‌కీయ వ్యూహాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స‌మ‌కాలీన రాజ‌కీయ నేత‌ల్లో ప‌లు అంశాల్లో కేసీఆర్ తెగువ ఓ ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన‌వ‌చ్చు. అయితే, అలాంటి కేసీఆర్ కూడా కొన్ని విష‌యాల్లో స్వ‌త‌హాగా చేస్తున్నారో తెలియ‌దు లేదా స‌మాచార లోపం వ‌ల్ల కావ‌చ్చు కానీ స‌రైన నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతున్నార‌ని అంటున్నారు. అందువ‌ల్లే, చ‌రిత్ర సృష్టించే ప‌నులు చేసిన‌ప్ప‌టికీ ప‌లు త‌ప్పులు దొర్లుతున్నాయ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా ప్ర‌స్తుతం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించ‌బోతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని పూర్తి చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు అదే ఫోక‌స్‌ను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై పెట్టారు. ఆ ప్రాజెక్టును మ‌రో రెండ్రోజుల్లో ప్రారంభించ‌బోతున్నారు. ఈ మేర‌కు అధికార బీఆర్ఎస్ వ‌ర్గాలు, ప్ర‌భుత్వ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నాయి.

అయితే ఈ స‌మ‌యంలోనే ఓ అపశృతి దొర్లింది. ప్రాజెక్టు కింద భూమిని కోల్పోయిన తాండూరు మండలం కుమ్మెర గ్రామ రైతు అల్లోజి మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో నిర్వాసితులు భ‌గ్గుమంటున్నారు. స‌హ‌జంగానే విపక్షాలు ఈ అవ‌కాశాన్ని టేకోవ‌ర్ చేసేశాయి.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నేడు అల్లోజీ మృతదేహానికి నివాళులర్పించి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. ఎన్నికల్లో లబ్ధి కోసమే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టు పనులు మొదలు పెట్టడమేంటని ప్రశ్నించారు.

ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తున్నారని డీకే అరుణ అన్నారు. రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు నిధులను కమిషన్ల రూపంలో కాజేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు. తక్షణమే రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పనులు ప్రారంభించే ముందు భూమిని కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆమె కోరారు.

కాగా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని అనుమ‌తులు సాధించుకొని వ‌చ్చి ప్రారంభోత్స‌వం కార్య‌క్ర‌మాన్ని ఇటు ప్ర‌భుత్వ‌ప‌రంగా అటు పార్టీ ప‌రంగా అట్ట‌హాసంగా చేప‌ట్టేందుకు ముందుకు సాగుతున్నారు. ఈ స‌మ‌యంలో నిర్వాసితుడు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం, గులాబీ ద‌ళ‌ప‌తి చ‌రిత్ర సృష్టించే స‌మ‌యంలో జ‌రిగిన త‌ప్పిదంగా భావిస్తున్నారు. కార‌ణాలు ఏవైనా , ఈ దుర‌దృష్ట‌క‌ర సంద‌ర్బం కేసీఆర్ ఖాతాలో చేరుతుంద‌ని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News