పాయకరావుపేట వైసీపీ సీటు కోసం డాక్టర్ రెడీ...!
అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ అసిస్టేంట్ జనరల్ మేనేజర్ గా ఉన్న డాక్టర్ తాడి ప్రకాశరత్నం వైసీపీ టికెట్ కోసం తన ప్రయత్నాలను ముమ్మరం చేసారు.
వైసీపీకి ఉమ్మడి విశాఖ జిల్లాలో పాయకరావుపేట సీటు బలమైనది అని చెప్పాలి. ఇక్కడ మూడు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు వైసీపీ విజయం సాధించింది. 2014లో మాత్రం టీడీపీ గెలిచింది. 2024 లో వైసీపీ గెలిచేందుకు చూస్తోంది.ఇక పాయకరావుపేట నుంచి మూడు సార్లు గెలిచిన సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మరోసారి పోటీకి ఉత్సాహంగా ఉన్నారు.
అయితే ఆయన పనితీరు పట్ల హై కమాండ్ కొంత అసంతృప్తిగా ఉంది అని అంటున్నారు. పైగా పాయకరావుపేటలో ఉన్న వైసీపీ క్యాడర్ కూడా ఆయన పట్ల విముఖంగా ఉందని అంటున్నారు. ఆయన వర్గం తో పాటు వ్యతిరేకగ వర్గం కూడా గట్టిగా ఉంది. బాబూరావుకు టికెట్ ఇవ్వవద్దు అని వారు అంటున్నారు. రెండేళ్ళ క్రితం సొంత పార్టీ వారే ఎమ్మెల్యేకు యాంటీగా రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహించారు.
ఈ పరిణామాలు ఇలా ఉంటే టీడీపీ జనసేన కలిస్తే వైసీపీ ధీటైన క్యాండిడేట్ ని పెడితేనే తప్ప విజయం కష్టం అన్న భావన ఉంది. అందుకే గొల్ల బాబూరావుకు ఈసారికి రెస్ట్ ఇవ్వాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. ఆయన ప్లేస్ లో చాలా మంది పేర్లు వస్తున్నాయి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ అసిస్టేంట్ జనరల్ మేనేజర్ గా ఉన్న డాక్టర్ తాడి ప్రకాశరత్నం వైసీపీ టికెట్ కోసం తన ప్రయత్నాలను ముమ్మరం చేసారు.
వైద్యునిగా మంచి పేరు ఉంది, అంగబలం అర్ధం బలం ఉన్నాయి, పాయకరావుపేటలో తన కంటూ ఇమేజ్ ఉంది. కొత్త ముఖం. వివాదరహితుడు ఇలా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. దాంతో ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో హై కమాండ్ సుముఖంగా ఉందా అన్న చర్చ మొదలైంది. తాజగా ప్రకాశరత్నం తాడేపల్లికి వచ్చారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ని కలవడానికి చూస్తున్నారు.
జగన్ కంటే ముందు ఆయన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డిని కలసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. తన అభ్యర్ధిత్వం గురించి జగన్ కి చెప్పమని కోరారని అంటున్నారు. అలాగే పార్టీ ముఖ్యులతో కూడా ఆయన భేటీల మీద భేటీలు నిర్వహిస్తున్నారు.
తాను పాయకరావుపేటలో పేదలకు వైద్యం చేస్తున్న సంగతిని ఆయన తెలియచేస్తూ తన బయోడేటాను వైసీపీ పెద్దల ముందు ఉంచుతున్నారు. తాను జగన్ కి వీరాభిమానిని అని ఆయన అంటున్నారు. తనకు అవకాశం ఇస్తే పాయకరావుపేటలో గెలుచుకుని వస్తానని అంటున్నారు. అంతే కాదు ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తాను అని చెబుతున్నారు.
పాయకరావుపేట టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు ఇస్తున్నరు. ఆమె పట్ల జనసేనలో అటు టీడీపీలో కొంత వ్యతిరేకత ఉంది. అలాగే బాబూరావు పట్ల వ్యతిరేకత ఉంది. దాంతో కొత్త ముఖంగా ప్రకాష్ రత్నానికి వైసీపీ చాన్స్ ఇస్తే ఆయన గెలుపు గుర్రం అవుతారా అన్న చర్చ అయితే అధికార పార్టీలో ఉంది అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.