'మా' మౌనం.. విష్ణుకు పోస్టు అవసరమా?
మా అద్యక్షు డు మంచు విష్ణు అసలు ఏం చేస్తున్నారు? అనేది కూడా సందేహంగానే మారిపోయింది. ''మా.. గురించి మాట్లాడడం వేస్ట్. ఉందంటే ఉంది.'' అని కీలక నిర్మాత వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పుష్ప-2 వివాదం.. అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. రాజకీయంగా.. సినీ వర్గాల పరంగా కూడా.. ఈ వ్యవహారం చాలా కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్(మా) కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. సహజంగా ప్రభుత్వానికి-సినీ రంగానికి మధ్య వారధిగా ఉండే.. 'మా'.. గతంలో అనేక సందర్భాల్లో స్పందించి.. అనేక సమస్యలకు పరిష్కారం చూపించింది.
కానీ, ఇప్పుడు మాత్రం అచేతన స్థితికి చేరుకుందనే భావన వ్యక్తమవుతోంది. అంతేకాదు.. అసలు మా ప్రమేయం గురించి కానీ, మా గురించి చర్చించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. మా అద్యక్షు డు మంచు విష్ణు అసలు ఏం చేస్తున్నారు? అనేది కూడా సందేహంగానే మారిపోయింది. ''మా.. గురించి మాట్లాడడం వేస్ట్. ఉందంటే ఉంది.'' అని కీలక నిర్మాత వ్యాఖ్యానించారు. దీనిని బట్టి మా పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో మా జోక్యం ఎంతో కీలకం.
అటు ప్రభుత్వానికి, ఇటు టాలీవుడ్‌కు మధ్య వారధిగా ఉంటూ.. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తే.. విష్ణు ప్రమేయంతో ఈ సమస్య సరై ఉంటే.. చాలా గ్రాఫ్ పెరిగి ఉండేది. తదుపరి అధ్యక్షుడిగా కూడా ఆయనకే మొగ్గు చూపే పరిస్థితి ఉండేది. కానీ, విష్ణు మాత్రం ఆదిశగా ప్రోత్సహించకపోగా.. కీలక వ్యాఖ్యలు చేసి.. తనను తాను డైల్యూట్ చేసుకున్నారన్న భావన వ్యక్తమవుతోంది. ''ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది'' అని విష్ణు వ్యాఖ్యానించారు.
నిజమే. ఎవరికైనా.. ప్రభుత్వాలతోనే మద్దతు ఉంటుంది. కానీ, ఆ ప్రభుత్వం నుంచి సమస్య వచ్చనిప్పు డు.. మా జోక్యం అనివార్యం. కానీ, విష్ణు దీనికి భిన్నంగా స్పందించారు. ''సున్నితమైన సమస్యలపై మా సభ్యులు స్పందించొద్దు. సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవడమే మంచిది. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేస్తుంది'' అని వ్యాఖ్యానించడం ద్వారా .. మా ప్రమేయం లేకుండా ఆయన స్టెప్ తీసుకున్నారు. కానీ, ఇది అసోసియేషన్ కీలక కార్యక్రమాలకు విఘాతం కలిగించే అవకాశం ఉంటుంది. ఎవరైనా సమస్యల్లో ఉన్నప్పుడే.. సంఘంవైపు చూస్తారు. కానీ.. విష్ణుకు ఆ మాత్రం తెలియకపోవడంపై ప్రముఖులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.