మరోసారి కాల్పుల కలకలం.. ట్రంప్ సేఫ్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో షాకింగ్ పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఇటీవల కాలంలో జరిగిన అధ్యక్ష ఎన్నికలకు భిన్నంగా తాజా ఎన్నికలు జరుగుతున్నాయి.

Update: 2024-09-16 04:57 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో షాకింగ్ పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఇటీవల కాలంలో జరిగిన అధ్యక్ష ఎన్నికలకు భిన్నంగా తాజా ఎన్నికలు జరుగుతున్నాయి. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ అధ్యక్షుడు ట్రంప్ మీద కాల్పులు జరగటం.. డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవటం.. అనూహ్యంగా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ రంగంలోకి రావటం లాంటి పరిణామాలతో ఒకదానికి మరో దానికి సంబంధం లేని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న వేళ... తాజా వీకెండ్ లో పామ్ బీచ్ లో గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్ కు సమీపంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే.. ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిగారు. ఫ్లోరిడా కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వేళలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అనంతరం అతడి వద్ద పిస్టల్ ఉన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే.. ట్రంప్ ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లుగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. ట్రంప్ నకు గోల్ఫ్ ఆడే అలవాటు ఉన్న విషయం తెలిసిందే.

ఆయన తరచూ గోల్ఫ్ ఆడుతుంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు.. ఉదయం నుంచి మధ్యాహ్నం లంచ్ ముందు వరకు వెస్ట్ పామ్ బీచ్ లోని తన గోల్ఫ్ కోర్టులోనే గడుపుతారు. ఈ ఆదివారం కూడా అదే పని చేశారు ట్రంప్. ఆ టైంలో ఒక వ్యక్తి పిస్టల్ తో ఉండటాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. ఆ వెంటనే అతడిపై వారు కాల్పులు జరిపారు.

అయితే.. ఈ ఘటనలో సదరు వ్యక్తి ఒక ఎస్ యూవీలో పారిపోయినట్లుగా భద్రతా సిబ్బంది చెబుతున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు అతడ్ని వెంబడించి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా ప్రదేశం నుంచి ఏకే 47 మోడల్ లాంటి గన్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మొత్తం ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలుకాలేదు. అయితే.. ఈ ఉదంతంలో సదరు దుండగుడ్ని ట్రంప్ ను హత్య చేసేందుకే వచ్చినట్లుగా ఎఫ్ బీఐ పేర్కొంది. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తాజా పరిణామం సంచలనంగా మారింది. తాజా ఘటనపై డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు.

ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు తనకు సమాచారం అందిందని.. అమెరికాలో హింసకు తావులేదని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అధ్యక్షుడు జోబైడెన్ కు అందజేశారు. మరోవైపు ఈ ఘటనపై రిపబ్లికన్ పార్టీ సభ్యుడు లిండ్సే గ్రాహమ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ తాను చేసిన వ్యక్తుల్లో... ట్రంప్ చాలా బలవంతుడిగా అభివర్ణించారు. ఈ ఘటన అధ్యక్ష ఎన్నికల మీద ఏ రీతిలో ప్రభావాన్ని చూపుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News