నేను సేఫ్.. నన్నెవరు ఆపలేరు.. తాజాగా రియాక్టు అయిన ట్రంప్
తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతానికి సంబంధించి.. నిందితుడ్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
వారాంతంలో తన పామ్ బీచ్ లో గోల్ఫ్ ఆడుతున్న అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు సమీపంలో గన్ తో సంచరించిన వ్యక్తిపై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతానికి సంబంధించి.. నిందితుడ్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఉదంతంపై ట్రంప్ స్పందించారు.
తన అభిమానులను ఉద్దేశించి ఈ-మొయిల్ చేశారు. తనకు సమీపంలో కాల్పులు జరిగాయని.. పరిస్థితి అదుపులో లేదనేది పుకార్లేనని తేల్చిన ఆయన.. ‘‘నేను మీ అందరికి ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నా. నేను బాగున్నాను. సురక్షితంగా ఉన్నా. నన్ను ఏదీ అడ్డుకోలేదు. ఎప్పటికీ లొంగేది లేదు’’ అంటూ పేర్కొన్నారు.
అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని హెచ్చరించిన భద్రతా దళాలు.. అతను వినకపోవటంతో.. అతడిపై కాల్పులు జరిపారు. అతను తప్పించుకొని పారిపోతుంటే.. వెంబడించి మరీ అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఎఫ్ బీఐ రియాక్టు అయ్యింది. మాజీ అధ్యక్షుడ్ని హత్య చేయాలనే ఉద్దేశంతోనే సదరు దుండగుడు ఆయుధంతో అక్కడికి వెచ్చాడని పేర్కొన్నారు. ట్రంప్ నకు అత్యంత దగ్గరగా నిందితుడు ర్యాన్ వెస్లీ రౌత్ వచ్చారన్నారు.
‘మాజీ అధ్యక్షుడు ట్రంప్ నకు 400 - 500 గజాల దూరంలోనే తన ఆయుధంతో రెడీ అవుతున్నాడు. వెంటనే స్పందించిన భద్రతా దళాలు కాల్పులు జరిపాం. అనంతరం అతను తప్పించుకొని పారిపోతుండగా.. వెంబడించి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్టు చేసి విచారిస్తున్నారు. తాజాగా ట్రంప్ మీద కాల్పులకు సిద్ధమైనట్లుగా చెబుతున్న రౌత్ ఎవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
గతంలో నిర్మాణ సంస్థలో పని చేసిన అతనికి ఎలాంటి మిలిటరీ బ్యాక్ గ్రౌండ్ లేదని చెబుతున్నారు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధానికి సంబంధించి తన మనసులోని మాటలను సోషల్ మీడియాతో షేర్ చేసుకున్నాడు. ఫైట్ అండ్ డై అంటూ పోస్టులు పెట్టినట్లుగా గుర్తించారు. ఇదిలా ఉంటే రౌత్ కుమారుడు స్పందించాడు. తన తండ్రి చాలా మంచి వ్యక్తి అని.. ఆయన నిజాయితీ బయటకు వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మరేం జరుగుతుందో చూడాలి.