ముఖ్యమంత్రి అయితే నాకేంటి ?!

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఏడు నెలలు దాటిపోయింది.

Update: 2024-07-03 09:30 GMT

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఏడు నెలలు దాటిపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ అవసరం కోసమో, అసంతృప్తితోనో ఆయన దారిలోకి వెళ్లిపోయారు. జగిత్యాల ఎమ్మెల్యే చేరిక నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా వరకు వెళ్లి ఆ తర్వాత మెత్తబడ్డాడు. కానీ వరంగల్ జిల్లాకు చెందిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం రేవంత్ ను డోన్ట్ కేర్ అంటున్నాడు.

అసలు ఇప్పటి వరకు ఆయన రేవంత్ వైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. 1999 నుండి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాకు మంత్రి పదవి ఇవ్వకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవి ఇవ్వడం ఏంటని దొంతి గుర్రుగా ఉన్నాడట. తాజాగా వరంగల్ పర్యటనకు వచ్చిన రేవంత్ అక్కడే ఆరున్నర గంటల పాటు ఉండి సమీక్షలు జరిపాడు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయినా దొంతి మాధవరెడ్డి మాత్రం కార్యక్రమానికి హాజరు కాలేదు. సమావేశం జరుగుతున్న సమీపంలోనే ఆయన ఇంట్లోనే ఉండి కూడా హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పుడే కాదు ఎన్నికలకు ముందు రేవంత్ ములుగు నుండి పాదయాత్ర ప్రారంభించాడు. పాదయాత్ర నర్సంపేట మీదుగా మహబూబాబాద్ వెళ్లాల్సి ఉండగా దొంతి రేవంత్ ను నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వలేదు. దీంతో పాదయాత్ర నేరుగా మహబూబాబాద్ వెళ్లిపోయింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో మహబూబాబాద్ లో రేవంత్ బహిరంగసభ జరగ్గా దాని పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరుగురు అభ్యర్థులు హాజరైనా దొంతి మాత్రం హాజరుకాలేదు. కాంగ్రెస్ అధిష్టానం నాకు బాస్ అంటూ మంత్రి పదవి కోసం పావులు కదుపుతున్నట్లు సమాచారం. నర్సంపేట నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డిపై దొంతి మాధవరెడ్డి 18889 ఓట్లతో విజయం సాధించాడు.

Tags:    

Similar News