ఇది చేయండి.. జగన్, చంద్రబాబులకు జేడీ కీలక సూచన!

2019 ఎన్నికల్లో ఈ అంశాలనే ప్రస్తావిస్తూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Update: 2024-01-31 07:47 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో మరో రెండు నెలల్లో అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కీలకాంశంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు పూర్తి, కడప స్టీల్‌ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు తదితర అంశాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి.

2019 ఎన్నికల్లో ఈ అంశాలనే ప్రస్తావిస్తూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సైతం ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వేదికగా ఉద్యమించనున్నారు. ఇప్పుడు ఇదే కోవలో జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి వీవీ లక్ష్మీనారాయణ ముందుకొచ్చారు.

ఈ మేరకు వీవీ లక్ష్మీనారాయణ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబులకు కీలక సూచన చేశారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయని.. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా పొందడానికి ఇది గొప్ప అవకాశమన్నారు. వార్షిక ఫైనాన్షియల్‌ స్టేట్మెంట్‌ బిల్లు (ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌) ను పార్లమెంటులో ఆమోదం పొందకుండా నిలిపేయాలని సూచించారు. ఇది చేసి ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో చిత్తశుద్దిని నిరూపించుకోవాలని లక్ష్మీనారాయణ కోరారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా పొందడానికి గొప్ప అవకాశం. వార్షిక ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌ బిల్లు (ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌) పార్లమెంటులో ఆమోదం పొందకుండా నిలిపివేయండి. ఇది చేసి ప్రత్యేక హోదా , విభజన హామీల విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రత్యేక హోదా సాధన సమితి డిమాండ్‌ చేస్తోంది’’ అని లక్ష్మీనారాయణ ఎక్స్‌ లో పోస్టు చేశారు.

కాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వీవీ లక్ష్మీనారాయణ తాజాగా విశాఖపట్నంలో ఒక రోజు దీక్ష చేశారు. విశాఖ టూటౌన్‌ ప్రాంతంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఈ దీక్షను చేపట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జగన్, చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News