గుట్టు వీడిన డబుల్ మర్డర్.. ఆ టైంలో వీడియోకు ఒప్పుకోలేదని
పండుగ వేళ.. హైదరాబాద్ మహానగరంలో జరిగిన డబుల్ మర్డర్ మిస్టరీ వీడింది. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పండుగ వేళ.. హైదరాబాద్ మహానగరంలో జరిగిన డబుల్ మర్డర్ మిస్టరీ వీడింది. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ వేళ.. హత్య ఎందుకు చేశారో వెల్లడించారు నిందితులు. పోలీసుల మాటల్ని విన్నంతనే ఉలిక్కి పడటమే కాదు.. ఇలా జరగటమా? అంటూ ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఉపాధి కోసం మధ్యప్రదేశ్ కు చెందిన అంకిత్ సాకేత్ హైదరాబాద్ మహానగరానికి వచ్చాడు. నానక్ రామ్ గూడలో హౌస్ కీపింగ్ పని చేస్తున్నాడు. ఆ టైంలో అతడికి ఛత్తీస్ గఢ్ కు చెందిన బిందుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
అయితే.. ఆమెకు అప్పటికే పెళ్లై.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిద్దరి మధ్య సంబంధం గురించి తెలిసిన భర్త.. అక్కడి నుంచి వనస్థలిపురానికి మకాంను మార్చాడు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య బంధం కంటిన్యూ అయ్యింది. అంతేకాదు.. సాకేత్ సాయంతో వ్యభిచారం మొదలు పెట్టింది. మధ్యప్రదేశ్ కు చెందిన రాహుల్ కుమార్.. రాజ్ కుమార్.. సుఖేంద్ర కుమార్ లు సాకేత్ స్నేహితులు. బిందును తమ వద్దకు తీసుకురావాలని చెప్పారు. దీంతో ఆమె జనవరి 8న భర్తకు చెప్పకుండా సాకేత్ వద్దకు వచ్చి అతడి గదిలోనే ఉంది.
బిందు కనిపించకపోవటంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఆమెపై మిస్సింగ్ కేసు నమోదైంది. రెండుసార్లు బిందుతో ఏకాంతంగా గడిపిన రాహుల్.. ఆ టైంలో ఆమెను సెల్ ఫోన్ లో వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. దీనికి ఆమె అభ్యంతరం తెలిపింది. అదే విషయాన్ని అంకిత్ కు చెప్పగా.. అతడు రాహుల్ కు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది.
వీరిపై కక్ష కట్టిన రాహుల్.. వారిద్దరిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తన స్నేహితులైన రాజ్.. సుఖేంద్రల సాయం తీసుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 22న అంకిత్ ద్వారా బిందును మరోసారి పిలిపించుకున్నారు. అదే రోజు రాహుల్.. రాజ్.. సుఖేంద్రలు కలిసి బిందు, సాకేత్ లను ఆటోలో పుప్పాల గూడ అనంత పద్మనాభ స్వామి గుట్టల వద్దకు తీసుకెళ్లారు. అందరూ మద్యం తాగుతుండగా.. బిందును సుఖేంద్ర పక్కకు తీసుకెళ్లాడు.
ఆ సమయంలో అంకిత్ ఒంటరిగా ఉండటతో రాహుల్.. రాజ్ కుమార్లు కత్తితో దాడి చేసి.. గాయపర్చారు. అనంతరం బండరాయితో కొట్టి చంపారు. ఆ తర్వాత బిందును చంపేశారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ లోని సొంతూరుకు వెళ్లిపోయారు. అయితే.. సెల్ ఫోన్ సిగ్నల్స్ సాయంతో ఆధారాల్ని సేకరించిన పోలీసులు.. వారు ఎక్కడ ఉన్నారో గుర్తించారు. అనంతరం ప్రత్యేక టీంలు మధ్యప్రదేశ్ కు వెళ్లి వారిని అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని వారిని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా వారు తమ నేరాన్ని అంగీకరించటంతో పాటు.. ఇద్దరిని హత్య ఎందుకు చేశారో చెప్పేశారు.