అసలు కథ: ఎవరీ పవిత్రా గౌడ? ఆమె కోసం కన్నడ స్టార్ దర్శన్ హత్య చేయటమా?
అసలేం జరిగింది? హత్య వరకు విషయం ఎందుకు వెళ్లింది? లాంటి ప్రశ్నలతో పాటు.. నటి పవిత్ర గౌడ్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?
కన్నడ నాట తీవ్ర సంచనలంగా మారిన మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా ఇప్పుడో షాకింగ్ న్యూస్ గా మారింది. సినిమా కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రముఖులు.. రీల్ లో మాదిరి రియల్ గా ఒకరిని హత్య చేయటం.. ఈ కేసులో ఇప్పుడు అరెస్టు అయిన ఈ స్టార్ నటీనటుల వ్యవహారం శాండల్ వుడ్ ను ఊపేస్తుంది. అసలేం జరిగింది? హత్య వరకు విషయం ఎందుకు వెళ్లింది? లాంటి ప్రశ్నలతో పాటు.. నటి పవిత్ర గౌడ్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? కన్నడ సూపర్ స్టార్ గా వెలుగుతున్న దర్శన్ తన అభిమానిని మర్డర్ చేయటం ఏమిటి? ఇంతవరకు విషయం ఎందుకు వెళ్లింది? అసలేం జరిగింది? లాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ సమగ్ర కథనం సమాధానం ఇస్తుంది.
ఈ స్టోరీని తొలుత కన్నడ సూపర్ స్టార్ దర్శన్ తో మొదలు పెడదాం. కన్నడ టాప్ హీరోల్లో ఒకరు దర్శన్. ఆయన్ను చాలెంజింగ్ స్టార్ గా పిలుస్తుంటారు. సూపర్ స్టార్ ఇమేజ్ అతని సొంతం. అతడి సినిమాలు తెలుగులో డబ్ కాలేదు కాబట్టి అతని గురించి తెలుగువారికి పెద్దగా తెలీదు. కన్నడిగులకు మాత్రం అరాధ్యనీయుడు. ఇండస్ట్రీలో అతడి ఎంట్రీ అసిస్టెంట్ కెమెరామాన్ నుంచి హీరోగా తర్వాత సూపర్ స్టార్ గా మారింది. ఇతడికున్న స్టార్ ఇమేజ్ తో పాటు అతగాడు తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటాడు.
ఒక సినిమాకు దాదాపు రూ.20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని చెబుతారు. ఇటీవల అతడి మార్కెట్ మరింత పెరిగిందని చెబుతారు. ఇతడి వ్యక్తిగత జీవితంలోకి వెళితే.. అతను 2003లో విజయలక్ష్మి అనే మహిళను పెళ్లాడారు. వీరికో బాబు (వినీష్) ఉన్నాడు. అతడికున్న స్టార్ డమ్ ను పక్కన పెడితే.. తరచూ అతను చిక్కుకునే వివాదాల్ని చూసినప్పుడు అవసరానికి మించిన టెంపర్ తో పాటు.. కోపాన్ని కంట్రోల్ చేసుకోని తీరు కనిపిస్తుంది. ఒకసారి మైసూర్ లోని ఒక హోటల్ లో వెయిటర్ మీద చేయి చేసుకోవటం.. ఆ వివాదాన్ని సెటిల్ చేసుకోవటం కోసం రూ.50వేలు ఇచ్చి సెటిల్ చేసుకోవటం కనిపిస్తుంది.
వైవాహిక జీవితానికి వస్తే.. భార్య విజయలక్ష్మితో సరైన రిలేషన్ లో లేదన్న మాట వినిపిస్తుంది. కారణం.. టాలీవుడ్ నటి నిఖిత తెలుసు కదా? ఆమెతో అతడికి రిలేషన్ ఉందని.. ఈ విషయంలో భార్య కలుగజేసుకొని ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్లుగా చెబుతారు. దాంతో ఆమె అతడితో సంబంధాన్ని కట్ చేసుకున్నట్లుగా చెబుతారు. పెళ్లైన ఎనిమిదేళ్లకు దర్శన్ గృహహింసకు పాల్పడినట్లుగా ఆరోపిస్తూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసులో దర్శన్ అరెస్టు కావటమే కాదు పద్నాలుగు రోజులు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. తర్వాత ఇద్దరు రాజీ పడ్డారు.
కట్ చేస్తే.. కొంతకాలానికి నటి పవిత్రా గౌడ్ తో అతగాడి రిలేషన్ మొదలైంది. దీనిపై పలు పుకార్లు షికార్లు చేసినా దానిపై స్పందించలేదు. అయితే.. అనూహ్యంగా నటి పవిత్ర తమ రిలేషన్ కు పదేళ్లు పూర్తైనట్లుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్టు చేయటంతో దర్శన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈ వీడియో దర్శన్.. విజయలక్ష్మిల వైవాహిక జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసినట్లుగా చెబుతారు. ఇక్కడే పవిత్ర గౌడ్ గురించి.. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పుకోవాలి.
కన్నడ సినీ పరిశ్రమలో నటిగా సుపరిచితురాలు. ఫ్యాషన్ డిజైనర్ గా ఆమెకు మంచి పేరుంది. 2016లో 54321 చిత్రం ద్వారా కన్నడ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆమె.. తర్వాత పలు చిత్రాల ద్వారా పాపులర్ అయ్యింది. బెంగళూరులో ఆమెకు రెడ్ కార్పెట్ స్టూడియో అనే ఫ్యాషన్ డిజైనర్ స్టూడియోను నిర్వహిస్తున్నారు. సంప్రదాయ చీరలను డిజైన్ చేయటంలో ఆమెకు మంచి పేరుందని చెబుతారు. ఆమె డిజైనింగ్ ల విషయంలో సినీ పరిశ్రమలోనూ పాపులార్టీ ఉంది. భర్తతో విభేదాల కారణంగా అతడితో దూరంగా ఉంది. ఆమెకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు ఖుషీ. భర్తతో ఉన్న విభేదాల నేపథ్యంలో అతడికి విడాకులు ఇచ్చిన ఆమెకు దర్శన్ ఒక సందర్భంలో పరిచయం ఏర్పడటం.. అది కాస్తా పెరిగి పెద్దదై.. ఇద్దరు రిలేషన్ లోకి వెళ్లే దాకా వెళ్లింది. వారి మధ్య వివాహేతర సంబంధం ఉంది.
స్టార్ నటుడు దర్శన్ తో ఆమెకున్న రిలేషన్ మీద వార్తలు వచ్చేవి. దీనికి ఆమె తీరే కారణంగా చెప్పాలి. ఎందుకంటే తన సోషల్ మీడియా ఖాతాలో దర్శన్ తో తాను దిగిన ఫోటోల్ని షేర్ చేసింది. ఈ సందర్భంగా దర్శన్ అభిమానులు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడటంతో కాస్త తగ్గిన ఆమె ఆ ఫోటోల్ని డిలీట్ చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది తమ బంధానికి పదేళ్లు అంటూ పవిత్ర పెట్టిన పోస్టు.. తర్వాత ఆమె కూతురు ఖుషీ పుట్టిన రోజు వేడుకల్లో దర్శన్ పాల్గొన్న దానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావటంతో వీరి మధ్య బంధం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఉదంతం.. ఇప్పుడు మర్డర్ కేసులో జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది.
దర్శన్ కు రేణుకక స్వామి అనే డైహార్డ్ ఫ్యాన్ ఉన్నాడు. తన హీరో ఇమేజ్ ను డ్యామేజ్ చేయటానికే పవిత్ర ఉందని.. తన హీరో సంసారాన్ని ఆమె దెబ్బ తీసినట్లుగా భావించేవాడు. తన అభిమాన హీరో భార్యకు అన్యాయం చేయటం సరికాదంటూ ఓపెన్ గా వ్యాఖ్యలు చేసేవాడు. అంతేకాడు పవిత్ర తీరును తీవ్రంగా తప్పు పట్టేవాడు. ఇదిలా ఉంటే.. గత శనివారం అతడి డెడ్ బాడీ కామిక్షి పాళ్యలోని ఒక అపార్టు మెంట్ సమీపంలో దొరికింది. దీంతో.. అప్పుడు వేళ్లన్నీ దర్శన్ వైపు వెళ్లాయి.
పవిత్ర గౌడ్ కు సోషల్ మీడియా ద్వారా తప్పుడు సందేశాలు.. ప్రైవేటు ఫోటోలు పంపటాన్ని తట్టుకోలేక దర్శన్.. అతడ్ని హత్య చేసి ఉంటారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్శన్ తో పాటు మరో తొమ్మిది మందిని.. తాజాగా పవిత్రను సైతం అరెస్టు చేశారు. స్టార్ హీరో అయి ఉండి ప్రియురాలి మీద మోజుతో తన కెరీర్ తో పాటు.. వ్యక్తిగత జీవితాన్ని దెబ్బేసుకున్నాడు. అభిమాని హత్య కేసులో బయటకు వస్తున్న విషయాలు షాకింగ్ గా మారుతున్నాయి.
ఈ కేసులో మొదటి ముద్దాయిగా పవిత్రను చేర్చారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా దర్శన్.. పవిత్రను పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా పవిత్ర పోలీసుల ఎదుట ఓపెన్ అయినట్లుగా చెబుతున్నారు. తనకు రేణుకాస్వామి పంపిన అశ్లీల చిత్రాల్ని తన ప్రియుడు దర్శన్ కు కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాను పోలీసులకు ఈ విషయాన్ని చెప్పి ఉంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ఉండేది కాదన్న వేదనను వ్యక్తం చేస్తూ పోలీసుల ఎదుట ఏడ్చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
తొలిరోజు విచారణలో ధీమాగా ఉన్న ఆమె తర్వాతి రెండు రోజుల విచారణలో మాత్రం ఆమె తీరు మారినట్లుగా చెబుతున్నారు. రేణుకా స్వామి హత్య కేసు గురించి కొన్ని వివరాల్ని బెంగళూరు పోలీసులు వెల్లడించారు. జూన్ 8న ఉదయం 11 గంటల వేళలో చిత్రదుర్గలో కిడ్నాప్ చేసిన రేణుకాస్వామిని బెంగళూరుకు తీసుకొచ్చారు. అనంతరం అతడిపై తీవ్రంగా దాడి చేశారు. ఇందులో భాగంగా ముఖం మీద పిడిగుద్దులు కురిపించిన దర్శన్.. ఆ తర్వాత అతడ్ని విసురుగా కొట్టటంతో అతని తల పక్కనే ఉంచిన టెంపో వాహనాన్ని కొట్టుకున్నారని.. దీంతో స్ప్రహ కోల్పోయినట్లుగా చెప్పారు. అయితే.. అప్పటికి ఊరుకోని దర్శన్.. అతడి మర్వావయాలపై బలంగా తన్నటంతో అతడు అక్కడికక్కడే మరణించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. శవపరీక్షలోనూ రేణుకా స్వామి మరణానికి కారణం మర్మాంగాన్ని బలంగా తన్నటమేనన్న విషయాన్ని తేల్చింది. రేణుకా స్వామి మరణించిన తర్వాత అతడి శవాన్ని తరలించేందుకు రూ.5 లక్షల చొప్పున పంచినట్లుగా పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో అతడి శవాన్ని తరలించేందుకు కామాక్షిపాళ్యలోని స్టోనీ బ్రూక్ హోటల్లో నిందితులతో సుదీర్ఘంగా దర్శన్ చర్చలు జరిపినట్లుగా గుర్తించారు. నిందితుల్లో ఒకరైన నవీన్ దే ఈ హోటల్. దీన్ని తాజాగా పోలీసులు సీజ్ చేశారు. విచారణలో భాగంగా వెల్లడైన వివరాల ప్రకారం .. హత్య అనంతరం పవిత్ర మీద కూడా దర్శన్ దాడి చేసినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం పరిస్థితికి కారణం ఆమెనంటూ విరుచుకుపడుతూ.. ఆమెపై దాడి చేసినట్లుగా చెబుతున్నారు. దీంతో గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నట్లుగా గుర్తించారు.
ప్రస్తుతం హత్య చేసిన (హత్య చేయలేదు.. హత్య చేయంచారన్న ఆరోపణ ఉంది) దర్శన్.. అతడి ప్రియురాలు ఊచలు లెక్కిస్తున్నారు. చట్ట ప్రకారం వెళ్లి ఉంటే.. ఇన్ని సమస్యలు ఎదురయ్యేవి కావన్న మాట వినిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ ప్రజ్వల్.. మండ్యలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. పోలీసులు తమ దర్యాప్తును నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మొదట్నించి మౌనంగా ఉన్న దర్శన్ కొడుకు వినీశ్ సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశారు. తన తండ్రి హత్య చేసినట్లుగా తాను భావించట్లేదని పేర్కొన్నారు. పోలీసుల విచారణ తర్వాతే ఎవరు హత్య చేసినట్లు తెలుస్తుందని.. అయినప్పటికీ తన తండ్రిని తిడుతూ పోస్టులు పెడుతున్న వారికి థ్యాంక్స్ అంటూ పోస్టు చేశారు. మొత్తంగా ఈ హత్య ఉదంతం యావత్ కర్ణాటకతో పాటు.. దేశ వ్యాప్తంగానూ సంచలనంగా మారింది.