తెరపైకి డాక్టర్ కోట శ్రీహరి మర్డర్.. ఏపీ రాజకీయాల్లో మరో కలకలం?
ఒక మనిషి ప్రాణం అన్యాయంగా పోయిన వేళ.. ఆ ఉదంతం ఉత్తనే పోదు. ఒక్కోసారి రోజుల్లో కొన్నిసార్లు ఏళ్లకు ఏళ్ల తర్వాత అయినా సదరు కుట్ర బయటకు వస్తుంది
ఒక మనిషి ప్రాణం అన్యాయంగా పోయిన వేళ.. ఆ ఉదంతం ఉత్తనే పోదు. ఒక్కోసారి రోజుల్లో కొన్నిసార్లు ఏళ్లకు ఏళ్ల తర్వాత అయినా సదరు కుట్ర బయటకు వస్తుంది. తాజాగా అలాంటి పరిస్థితే ఏపీలో నెలకొంది. నాలుగేళ్ల క్రితం క్రిష్ణా జిల్లా అవనిగడ్డలో అత్యంత కిరాతంగా హత్యకు గురయ్యారు 65 ఏళ్ల డాక్టర్ కోట శ్రీహరి. ఇంతవరకు ఆ హత్యకు సంబంధించి ఎలాంటి కదలికా లేదు. హత్య కారణం ఏంటి? ప్రాథమిక ఆధారాలు.. నిందితులు ఎవరన్న అంశంపై అడుగు ముందుకు పడలేదు.
అయితే.. ఈ దారుణ హత్యలో వైసీపీకి చెందిన కీలక నేత.. ఆయన ప్రధాన అనుచరుడి మీద అనుమాన వేళ్లు చూపిస్తున్న పరిస్థితి. రాజకీయ ఒత్తిళ్లతో ఈ కేసు దర్యాప్తును నీరుగార్చారన్న విమర్శలు ఉన్నాయి. అన్నింటికి మించిన మరో అంశం ఏమంటే.. హత్యకు కారణం ఏమిటి? అన్నది పక్కన పెడితే.. హత్యకు గురైన డాక్టర్ కొడుకునే ఈ కేసులో విశ్వ ప్రయత్నాలు జరగటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
2020 నవంబరు27 అర్థరాత్రి ఈ దారుణ హత్య జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఈ హత్య కేసును సీఐడీకి అప్పగించాలని జులైలో నిర్ణయించినప్పటికీ.. ఇప్పటివరకు సీఐడీ పోలీసులు ఈ కేసు దర్యాఫ్తును షురూ చేయకపోవటం గమనార్హం. ఈ హత్య ఉదంతంపై లోతుగా దర్యాప్తు జరిపితే.. సంచలన అంశాలు వెలుగు చూసే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ హత్య గురించి సమాచారం అందిన తర్వాత ఘటనా స్థలాన్ని సందర్శించిన అప్పటి జిల్లా ఎస్పీ.. ఆధారాలు ఏమీ దొరకలేదని అప్పటికప్పుడు ప్రకటించటం అప్పట్లో విమర్శలకు తావిచ్చింది.
అన్నింటికంటే విచిత్రమైన అంశం ఏమంటే.. హత్యకు గురైన డాక్టర్ కుమారుడు తన తండ్రి హత్యపై పలు సందేహాలు వ్యక్తం చేయగా.. ఆయన్నే కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. దీంతో.. ఆయన నెత్తి నోరు కొట్టుకున్న పరిస్థితి. ఈ హత్య జరిగిన తీరు చూస్తే.. అచ్చం వైఎస్ వివేకానందరెడ్డి హత్యను గుర్తుకు తెచ్చేలా ఉండటం విశేషం. 2020 నవంబరు 27 అర్థరాత్రి డాక్టర్ ఒంటరిగా ఇంట్లో ఉన్న వేళలో.. దుండగులు ఇంట్లోకి చొరబడి ఆయన్ను చంపేశారు.
తర్వాతి రోజు ఉదయం ఆయన హత్య అంశం వెలుగు చూసింది. మొదట.. ఆయన గుండెపోటుతో మరణించినట్లుగా ప్రచారం జరిగింది. తర్వాత రక్తపు వాంతులతో మరణించినట్లుగా చెప్పారు. కాసేపటికి దొంగలు ఇంట్లోకి చొరబడి ఆయనను చంపేశారన్న మాట చెప్పటం కనిపిస్తుంది. శ్రీహరి హత్యకు గురైన సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తొలుత సమాచారం ఇవ్వకపోవటం గమనార్హం. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కు సమాచారం ఇవ్వటం.. ఆయన, అతని అనుచరుడు నరసింహారావు.. మరికొందరు ఘటనా స్థలానికి వచ్చి.. మొత్తం చూసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యుల ఆరోపణగా చెబుతారు. ఈ హత్య ఉదంతం తాజాగా చర్చకు వచ్చిన నేపథ్యంలో కూటమి సర్కారు సీరియస్ గా ఫోకస్ చేస్తే.. ఏపీ రాజకీయాల్లో కచ్ఛితంగా కలకలం రేగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.