టీకాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత
ఈ తరానికి ఎంపీ అర్వింద్ తండ్రిగా సుపరిచితుడు కానీ.. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతల్లో ఒకరు.
ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన తెలంగాణ కాంగ్రెస్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఈ తెల్లవారుజామున హైదరాబాద్ లో కన్నుమూశారు. వివిధ పదవుల్ని అలంకరించిన ఆయన గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం (శనివారం) మూడు గంటల వేళలో గుండెపోటుతో చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన కుమారుల్లో ఒకరు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఈ తరానికి ఎంపీ అర్వింద్ తండ్రిగా సుపరిచితుడు కానీ.. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతల్లో ఒకరు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రినివాస్ అలియాస్ డీఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళలో మంత్రిగా వ్యవహరించారు. పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2015లో అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ లో చేరిన ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి సొంతగూటికి (కాంగ్రెస్) వచ్చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి డి సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా వ్యవహరిస్తే..చిన్నకొడుకు ధర్మపురి అర్వింద్ బీజేపీ ఎంపీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
డీఎస్ బ్యాక్ గ్రౌండ్ కు వెళితే.. ఆయన 1948 సెప్టెంబరు 27న జన్మించారు. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 1989లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 -1994 వరకు గ్రామీణాభివ్రద్ధి, ఐ అండ్ పీఆర్ మంత్రిగా వ్యవహరించారు. 2004లో మరోసారి విజయం సాధించిన ఆయన వైఎస్ సర్కారులో మంత్రిగా వ్యవహరించారు. 2004, చ2009 ఎన్నికల వేళలో ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
2004లో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు విషయంలో కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటం కోసం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటంలోనూ.. ఆ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అంశంలోనూ కీరోల్ ప్లే చేశారు. అంచనాలకు తగ్గట్లే కాంగ్రెస్ అధికారంలోకి రావటం.. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం.. ఆ సర్కారులో మంత్రిగా వ్యవహరించారు. వైఎస్ తో వ్యక్తిగతంగా పొసగనప్పటికి.. గుంభనంగా ఉంటూ తనదైన శైలిలో విమర్శలు చేసేవారు. కాంగ్రెస్ అధినాయకత్వంతో మంచి సంబంధాలు ఉండేవి.
గాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా ఆయనకు పేరుంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు పలువురితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జైపాల్ రెడ్డి.. కాసు బ్రహ్మానందరెడ్డి.. కోట్ల విజయభాస్కర్ రెడ్డి.. మర్రి చెన్నారెడ్డి.. నేదురమల్లి జనార్దన్ రెడ్డి ఇలా సీనియర్లతో సన్నిహితంగా ఉండేవారు. 2013 -2015 మధ్యలో ఎమ్మెల్సీగా వ్యవహరించిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మండలిలో విపక్ష నేతగా ఉన్నారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశంలభించకపోవటంతో 2015లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి గులాబీ కారును ఎక్కేశారు. టీఆర్ఎస్ తీర్థం స్వీకరించారు.
2016-22 మధ్య వరకు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన ఆయన.. ఆ పదవిలో ఉన్నప్పుడు కేసీఆర్ తో విభేదించి తిరిగి కాంగ్రెస్ కు వచ్చేశారు. డీఎస్ మరణంపై కాంగ్రెస్ నేతలు పలువురు తమ సంతాపాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ కు వీర విదేయుడైన డీఎస్ కు భిన్నంగా ఆయన చిన్న కొడుకు బీజేపీతో మమేకం కావటం.. రెండుసార్లు బీజేపీ ఎంపీగా గెలుపొందటం గమనార్హం. తండ్రి.. కొడుకులు పార్టీల పరంగా వేర్వేరు దారులైనప్పటికి.. ఇద్దరి మధ్య అనుబంధం చాలా ఎక్కువ. తన తండ్రి.. గురువు.. అన్నీ నాన్నేనని.. పోరాడు.. భయపడొద్దంటూ తనకు నేర్పింది తన తండ్రేనంటూ ధర్మపురి అర్వింద్ కన్నీటి పర్యంతమవుతున్నారు. డీఎస్ మరణంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కు సంబంధించి ఒక శకం ముగిసినట్లుగా చెప్పాలి.