రజినీకాంత్‌.. అప్పుడు వైసీపీ.. ఇప్పుడు డీఎంకే నేతలు!

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ వరుస సినిమాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన హీరోగా వచ్చిన జైలర్‌ ఘనవిజయం సాధించింది

Update: 2024-08-27 06:24 GMT

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ వరుస సినిమాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన హీరోగా వచ్చిన జైలర్‌ ఘనవిజయం సాధించింది. రజినీ స్టామినా ఏంటో చూపించింది. కాగా రజినీకాంత్‌ రాజకీయాల్లో లేకపోయినా ఆయనను వివాదాలు వీడటం లేదు. విమర్శలకు గురవుతూనే ఉన్నారు.

గతంలో ఆంధ్రప్రదేశ్‌ కు వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబును పొగుడుతూ మాట్లాడారని నాటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రజినీకాంత్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఇప్పుడు ఇదే కోవలో ఆయనను తమిళనాడులోని డీఎంకే మంత్రి టార్గెట్‌ చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలను సీరియస్‌ గా తీసుకోవట్లేదని.. ఆయన తన స్నేహితుడు రజినీ వ్యాఖ్యానించడం కొసమెరుపు.

ఇంతకూ ఏం జరిగిందంటే.. చెన్నైలో తాజాగా ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి రజినీకాంత్, డీఎంకే మంత్రి దురై మురుగన్‌ తదితరులు హాజరయ్యారు. ఈ క్రమంలో ముందుగా మాట్లాడిన రజినీకాంత్‌.. మంత్రిపై హాట్‌ కామెంట్స్‌ చేశారు.

ఇక్కడ (డీఎంకే)లో చాలా మంది పాత విద్యార్థులు ఉన్నారని.. అయితే వాళ్లు సాధారణ విద్యార్థులు కాదన్నారు. ఎవరికి వారే అసాధారణ తెలివితేటలు ఉన్న విద్యార్థులని.. వీళ్లంతా ర్యాంకుల కోసం పోటీ పడుతున్నారని.. తరగతి గదిని మాత్రమే విడిచిపెట్టిపోవడం లేదని సెటైర్లు వేశారు.

ఈ కార్యక్రమంలో ఉన్న దురై మురుగన్‌ కూడా అలాంటి పాత విద్యార్థేనని అన్నారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి.. స్టాలిన్‌ సార్‌ మీరు పాత విద్యార్థులను కూడా అద్భుతంగా మేనేజ్‌ చేస్తున్నారు.. మీకు నా హ్యాట్సాప్‌ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో రజినీకాంత్‌ వ్యాఖ్యలకు ఆ కార్యక్రమంలోనే ఉన్న దురై మురుగన్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. రాజకీయాల్లో ఉన్న పరిస్థితే సినిమా రంగంలోనూ ఉందన్నారు. గెడ్డాలు పెరిగిపోయి పళ్లూడిపోయినవారు, బోసినోటితో కూడా నటించే ముసలి నటులు ఉన్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి ముసలి నటుల వల్ల యువకులు అవకాశాలు కోల్పోతున్నారని రజినీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలను రజినీకాంత్‌ పట్టించుకోలేదు. ఎన్నో ఏళ్లుగా దురై మురుగన్, తాను స్నేహితులమన్నారు. ఈ స్నేహం ఇక ముందు కూడా కొనసాగుతుందని, ఆయన వ్యాఖ్యలను తాను పట్టించుకోవడం లేదని తెలిపారు.

Tags:    

Similar News