తల్లి మందలించిందని కేబుల్ బ్రిడ్జిపైనుంచి దూకిన బాలిక!

తాజాగా హైదరాబాద్ లో ఓ ఇంటర్ విద్యార్థిని దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది

Update: 2023-08-02 04:18 GMT

కారణం ఏదైనా.. సమస్య ఎంత చిన్నదైనా.. మరెంత సిల్లీదైనా... ఈ మధ్యకాలంలో ఆత్మహత్యను ఫస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటున్న యువత సంఖ్య పెరిగిపోతోందని అంటున్నారు నిపుణులు. అజ్ఞానంతో ఇలా చేస్తున్నారా.. లేక, అర్ధజ్ఞానంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదు కానీ... తాజాగా ఒక బాలిక ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.

అవును... తాజాగా హైదరాబాద్ లో ఓ ఇంటర్ విద్యార్థిని దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. తల్లి మందలించిందనే కారణంతోనే ఈ పనికి పూనుకుందని తెలుస్తోంది. అయితే ఆమెను లేక్ పోలీసులు కాపాడటంతో ప్రాణాలతో బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ లో ఉంటున్న ఓ బాలిక ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈమె నిత్యం ఫోన్ పట్టుకుని సోషల్ మీడియాలో బిజీగా ఉంటోందంట. దీంతో అవిరామంగా చేస్తోన్న సోషల్ మీడియాలో చాటింగ్ విషయమై తల్లి ఆ బాలికను మందలించిందట.

ఈ నేపథ్యంలో... మంగళవారం ఉదయం 7.30 సమయంలో కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరిందట. అయితే, ఆమె క్లాస్ కు రాలేదని కాలేజీ నుంచి సమాచారం రావడంతో తల్లి తనకు తెలిసిన చోటెల్లా గాలించిందట. అనంతరం కే.పీ.హెచ్‌.బీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాలింపు చేపట్టారు.

ఇందులో భాగంగా... విద్యార్థిని సెల్‌ ఫోన్‌ ను ట్రాక్ చేసిన పోలీసులు.. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో ఆమె దుర్గం చెరువు దగ్గర ఉన్నట్లు గుర్తించారట. దీంతో... వెంటనే మాదాపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన లేక్ పోలీసులు, ఐటీ మొబైల్ సిబ్బంది దుర్గం చెరువు వద్దకు చేరుకున్నారట.

సరిగ్గా ఆ సమయంలో కేబుల్ బ్రిడ్జి మీద నుంచి చెరువులోకి దూకిన బాలికను గమనించిన పోలీసులు.. బోటింగ్ సిబ్బంది సహాయంతో ఆమెను రక్షించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. దీంతో తమ కూతురును కాపాడినందుకు బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదే విధంగా... సకాలంలో స్పందించిన లేక్ పోలీసులను, ఐటీ మెబైల్ స్టాఫ్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు. కాగా.. ఇటీవల కాలంలో కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత సంఖ్య పెరుగుతుందంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే!

Tags:    

Similar News