సోషల్ మీడియా స్టార్ దువ్వాడ!

ఆయన ఫ్యామిలీ డ్రామాతో ఈ ఏడాది యూట్యూబ్ ట్రెండింగ్ ఐటెమ్ గా మారారు.

Update: 2024-12-23 10:30 GMT

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఓటమి తర్వాత ఏ వైసీపీ నాయకుడికి లేనంత క్రేజ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ దక్కించుకున్నారు. ఆయన ఫ్యామిలీ డ్రామాతో ఈ ఏడాది యూట్యూబ్ ట్రెండింగ్ ఐటెమ్ గా మారారు. ఆయన ఇంటర్వ్యూల కోసం డిజిటల్ మీడియా పరుగులు పెట్టడం విశేషంగా చెప్పొచ్చు. పొలిటికల్ గా పెద్ద విజయాలు నమోదు చేయని దువ్వాడ సోషల్ మీడియాను ఆకర్షించడం వెనుక లేటు వయసులో ఆయన ఘాటు ప్రేమ జనాలకు విపరీతంగా నచ్చిందనే విశ్లేషణలున్నాయి.

శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన దువ్వాడ ఎమ్మెల్యేగా గెలిచేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ, స్థానికంగా టీడీపీకి గట్టి పట్టు ఉండటం, తన రాజకీయ ప్రత్యర్థి, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడిని ఎదిరించే బలం లేకపోవడంతో ఎప్పుడూ ఓటమితోనే సరిపెట్టుకోవాల్సివచ్చేది. అయితే గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ ప్రోద్బలంతో దువ్వాడ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1999 నుంచి ఇప్పటివరకు రాజకీయంగా ఎన్నో ప్రయత్నాలు చేసినా, రాష్ట్ర స్థాయిలో ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పొచ్చు.

కానీ, ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత జనసేన అధినేత పవన్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేయడంతో ప్రధాన మీడియాను ఆకర్షించారు. ఇలా దువ్వాడ ఇమేజ్ పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రమే ఉండేది. కానీ, ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలతో ఆయన ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ గా మారిపోయారు. రాష్ట్రంలో ఎంతో మంది సెలబ్రెటీలు ఉన్నప్పటికీ, దువ్వాడపై వీడియోలు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో డిజిటల్ మీడియా సైతం దువ్వాడ, ఆయన ప్రియురాలు దివ్వెల మాధురి ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్నారు.

కుటుంబ వివాదంతో భార్యకు దూరంగా ఉంటున్న దువ్వాడ.. గత ఎన్నికల్లో టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. రాజకీయంగా తగిలిన ఇలాంటి దెబ్బలతో ఎవరైనా ఇంటికే పరిమితమైపోతారు. కానీ, దువ్వాడ విషయంలో రాజకీయ దెబ్బతో పాటు కుటుంబ వివాదం ఆయన రోడ్డెక్కించింది. అయితే వివాదంలో ఆయనతో మరో మహిళ సన్నిహితంగా ఉంటుందనే ఆరోపణలు రావడం, ఉంటే తప్పేంటని ఆ మహిళ దువ్వాడను వెనకేసుకురావడం సోషల్ మీడియాను ఆకర్షించింది.

ఈ కుటుంబ సమస్యను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో దువ్వాడ సక్సెస్ కావడంతో జనం కూడా ఆయనను బాధను అర్థం చేసుకున్నారు. దీంతో ఆయన, ఆయన ప్రేయసి మాధురి ఎక్కడికి వెళ్లినా వారితో ఫొటోలు దిగేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఓ సాధారణ పొలిటీషియన్ అయిన దువ్వాడ అంతకుముందు తన నియోజకవర్గానికే పరిమితమయ్యేవారు. ఇక మాధురి సాధారణ మహిళగా తన సొంత ఇంటికే పరిమితమయ్యారు. కానీ, దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ వల్ల ఈ ఇద్దరికి స్టార్ ఇమేజ్ వచ్చేసింది. దీనికి కారణం వారు చెబుతున్నది జనాలు వింటుండమే. జనాలు సమర్థిస్తున్నారో? తిరస్కరిస్తున్నారో గానీ, దువ్వాడ, దివ్వెల మాధురి కనిపిస్తే ఒక క్లిక్ మాత్రం చేస్తున్నారు. దీంతో దువ్వాడకు స్టార్ ర్యాంక్ వచ్చేందనే టాక్ వినిపిస్తోంది. చాలా యూట్యూబ్ చానళ్లు దువ్వాడ జంట ఇంటర్వ్యూల కోసం సమయం కోరుతుండటం, వంతులు వారీగా వీడియోలు అప్ లోడ్ చేయడం చూస్తే ఈ ఏడాది బెస్ట్ డిజిటల్ స్టార్ అవార్డు దువ్వాడకే దక్కుతుందని అంటున్నారు. ఏదైనా లేటు వయసులో ఆయన ఘాటు ప్రేమ ఆన్ లైన్ వేదికగా హిట్టుకొట్టిందనే చెప్పాలి.

Tags:    

Similar News