ఆడియో లీక్ తో ఎమ్మెల్సీ దువ్వాడకు కొత్త కష్టం.. మాధురి పెట్రోల్ బంక్ కోసం!

పోర్టు నిర్మాణానికి రోజుకు 20 వేల లీటర్ల ఇంధనం అవసరమవుతుందని.. అందుకే మాధురి డీలర్ షిప్ ను పునరుద్ధరించాలని వార్నింగ్ ఇచ్చారు.

Update: 2024-08-13 04:47 GMT

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టైం అస్సలు బాగున్నట్లుగా లేదు. ఒకటి తర్వాత ఒకటిగా ఎదురవుతున్న సవాళ్లు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే కుటుంబ వివాదాల్లో రోడ్డున పడ్డ ఆయన గురించి తెలిసిందే. మాధురి అనే మహిళతో లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లుగా భార్య ఆరోపించటం.. ఈ సందర్భంగా భార్యను.. పిల్లల్ని ఇంట్లోకి రానివ్వకుండా చేయటం.. ఇరు పక్షాల వారు పోలీసు కేసు పెట్టుకోవటం.. కొద్ది రోజులుగా టీవీ చానళ్లలోనూ.. సోషల్ మీడియాలోనూ అదే పనిగా వైరల్ అవుతున్న దువ్వాడ ఎపిసోడ్ లో మరో కొత్త కోణం తెర మీదకు వచ్చింది.

దువ్వాడకు సన్నిహితంగా ఉంటూ.. కలిసి ఉంటున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి పెట్రోల్ బంక్ కోసం బెదిరింపులకు దిగిన వైనం తెర మీదకు వచ్చింది. ఒక పెట్రోల్ రిఫైనరీ సంస్థ అధికారిని ఫోన్ లో బెదిరింపులకు దిగిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయనకు అత్యంత సన్నిహితురాలిగా పేరు పడ్డ దివ్వల మాధురికి చెందిన పెట్రోల్ బంక్ అనుమతుల్ని తక్షణమే పునరుద్ధరించాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

తలగాం కూడలి వద్ద ఉన్న పెట్రోల్ బంక్ లైసెన్సు రద్దైంది. డీలర్ షిప్ కూడా తొలగించారని.. ఇప్పుడు పునరుద్ధరించటం సాధ్యం కాదని సదరు పెట్రోల్ రిఫైనరీ సంస్థ అధికారి చెప్పగా.. తీవ్రంగా రియాక్టు అయిన దువ్వాడ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తానేం రోడ్డున పోయే సాదాసీదా వ్యక్తిని కాదంటూ తన పవర్ గురించి చెప్పుకొచ్చారు. అంతేకాదు.. తాను సదరు సంస్థ పై అధికారులతో మాట్లాడిన తర్వాత కూడా పని ఎందుకు చేయవంటూ సీరియస్ గా ప్రశ్నించారు.

పోర్టు నిర్మాణానికి రోజుకు 20 వేల లీటర్ల ఇంధనం అవసరమవుతుందని.. అందుకే మాధురి డీలర్ షిప్ ను పునరుద్ధరించాలని వార్నింగ్ ఇచ్చారు. తాను చెప్పిన పని చేయకుంటే తిప్పలు తప్పవన్న విషయాన్ని హెచ్చరిక రూపంలో ఇచ్చేయటం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన ఆడియో బయటకు వచ్చి వైరల్ గా మారింది. రానున్న రోజుల్లో దువ్వాడకు చెందిన మరెన్ని సంచలన అంశాలు వెలుగు చూస్తాయో చూడాలి.

Tags:    

Similar News