భూమికి రెండో చంద్రుడు... టెక్నికల్ గా మినీమూన్ కాదంట!

భూమికి ఒక చంద్రుడు ఉన్నాడు. పండువెన్నెల వేళ తెల్లగా మెరిసిపోతూ చల్లని వెన్నెలను ఇస్తుంటాడు.

Update: 2024-09-25 16:30 GMT

భూమికి ఒక చంద్రుడు ఉన్నాడు. పండువెన్నెల వేళ తెల్లగా మెరిసిపోతూ చల్లని వెన్నెలను ఇస్తుంటాడు. మరి ఒక చంద్రుడు ఉంటేనే ఇలా ఉంటే.. భూమికి రెండో చంద్రుడు కూడా ఉంటే..? ఉంటే... ఏమిటి... ఉంది! కాకపోతే అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. దీంతో ఈ విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

అవును... 2024 పీటీ5 అనే గ్రహ శకలం భూమి గురుత్వాకర్షణకు లోబడి జాబిల్లిగా మారనుందని అంటున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 వరకు ఈ గ్రహ శకలం భ్హుమి చుట్టూ ప్రదక్షిణ చేయనుంది. తర్వాత భూ గురుత్వాకర్షణ నుంచి విడిపోయి, తిరిగి అంతరిక్షంలోకి ఎగిరిపోతుంది.

33 అడుగుల పొడవు, సుమారు 138 అడుగుల వెడల్పు ఉండే ఈ గ్రహశకలాని మన కళ్లతో కానీ, చిన్న చిన్న టెలీస్కోప్ తో కానీ చూడలేమని అంటున్నారు. అందుకు గల కారణం... ఇది చాలా ఎత్తులో ఉండటంతో పాటు చిన్నగా ఉండటమే అని అంటున్నారు. అయితే... దీనితో భూమికి ఉన్న ముప్పేమీ లేదు కానీ.. కొంతకాలమే ఈ రెండో చంద్రుడిగా అలరించనుంది.

వాస్తవానికి నాసా సాయంతో నిర్వహిస్తున్న ఆస్టరాయిడ్ టెరిస్ట్రియల్ - ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టం (అట్లాస్) సాయంతో 2024 ఆగస్టు 7న పీటీ5ను గుర్తించారు. ఆ సమయంలో దాని గమనం తీరు చూసి.. ఇది సుమారు రెండు నెలల పాటు భూమి చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చని అంటున్నారు. ఇది నవంబర్ 25 వరకూ ఉంటుందని చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబోరేటరీకి చెందిన నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ డైరెక్టర్ పాల్ చోడస్... ఇది ఏదో ఒక అంతరిక్ష వస్తువు ఢీకొన్నప్పుడు చంద్రుడి నుంచి విడిపోయిన ముక్కలా కనిపిస్తుందని అంటున్నారు. అంటే... ఈ రెండో చంద్రుడు.. అసలు చంద్రుడిలో చిన్న భాగమన్నమాట.

అయితే.. చంద్రుడి వారసత్వాన్న్ని కలిగి ఉన్నప్పటికీ టెక్నికల్ గా దీన్ని మినీ మూన్ గా భావించలేమని అంటున్నారు. భూమి గురుత్వాకర్షణకు లోబడిన గ్రహ శకలం.. భూమి చుట్టూ కనీసం ఒక్కసారైనా పూర్తిగా ప్రదక్షిణ చేయాలి. కానీ ఈ 2024 పీటీ5 అలా తిరగటం లేదు. అందువల్ల... దీన్ని మినీమూన్ గా పరిగణించలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు.

కాగా... భూ గురుత్వాకర్షణను తప్పించుకోలేక, కొద్దికాలం పాటు భూమి చుట్టూ ప్రదక్షిణ చేసే గ్రహ శకలాలను మినీ మూన్స్ అని అంటారు.

Tags:    

Similar News