'తూర్పు' తమ్ముళ్ల తలో దారి.. బద్నామయ్యేది బాబేగా.. !
కానీ, తాజాగా ఆయన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై నోరు చేసుకున్నారు. ఉచితం అంటే.. ఉచితంగా ఇవ్వాలి కానీ, డబ్బులు కట్టించుకోవడం ఏంటి?
తూర్పు గోదావరి జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట. ఏదో 2019లోకొంత దారి తప్పినా.. 2024లో మళ్లీ ఇక్కడ పార్టీ పక్కాగా పాగా వేసేసింది. అలాంటి జిల్లాలో కొందరు సీనియర్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు రాజ కీయంగా పార్టీని, అటు చంద్రబాబును కూడా బద్నాం అయ్యేలా చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నా యి. ఎవరి అజెండాలు వారికి ఉన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు. వారు కూడా నిన్న కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి ఉంటే..మరో విధంగా ఉండేది.
కానీ, సీనియర్లు, కాకలు తీరిన నాయకులే ఇలా పార్టీ పరువును పాడుచేసేలా వ్యవహరించడం సొంత నేతల్లోనే చర్చకు దారి తీసింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ(వెంకట అప్పారావు) చాలా సీనియ ర్ నేత. కానీ, తాజాగా ఆయన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై నోరు చేసుకున్నారు. ఉచితం అంటే.. ఉచితంగా ఇవ్వాలి కానీ, డబ్బులు కట్టించుకోవడం ఏంటి? అనేది ఆయన ఉవాచ. దీనివల్ల ఉచితం అన్నమాటే అర్ధం లేకుండా పోతుందన్నారు.
అంతేకాదు.. తమ పార్టీ నాయకులను కూడా ఉద్దేశించి.. చాలా మంది వ్యాపారులు పేదల ఇళ్లకు వెళ్లి 5 రూపాయాలు 10 రూపాయల వడ్డీలకు అప్పులు ఇస్తున్నారని.. దీనిని ప్రోత్సహించేందుకే ఈ పథకాన్ని తీసుకువచ్చినట్టుగా ఉందని అనేశారు. మరి ఆయన తెలిసి అన్నారో.. తెలియక అన్నారో.. మొత్తంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకంపై విమర్శలు చేశారు. ఇక, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు వ్యవహారం మరో రీతిలో ఉంది.
కాకినాడ మునిసిపల్ కమిషనర్ భావనతో ఆయన కయ్యం పెట్టుకున్నారు. ఆమె జనసేన నాయకుల మాటే వింటోందని, తన మాటను లెక్కచేయడం లేదని బహిరంగంగానే నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో నే ఇటీవల తన నియోజకవర్గంలోనే జరిగిన బయో మెథనేషన్ ప్లాంట్ నిర్మాణ కార్యక్రమానికి జరిగిన శంకుస్థాపనకు డుమ్మా కొట్టారు. ఇదేసమయంలో కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆవేదన, బాధ అంతా.. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, జనసేన నాయకుడు పంతం నానాజీని టార్గెట్ చేసినట్టే ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇలా.. ఒక్కొక్క నేత ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తే.. బాబు బద్నాం కారా? అనేది ప్రశ్న.