ఈడీ ఎదుట విజయసాయిరెడ్డి
దీంతో జనవరి 6 సోమవారం నాడు హైదరాబాద్ బహీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయానికి విజయసాయిరెడ్డి వచ్చారు.
వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణకు రమ్మంటూ ఈడీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో జనవరి 6 సోమవారం నాడు హైదరాబాద్ బహీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయానికి విజయసాయిరెడ్డి వచ్చారు.
గత ప్రభుత్వంలో కాకినాడ సీపోర్టు, కాకినాడ సెజ్లో వాటాలను బలవంతంగా బదిలీ చేయించుకున్నారని కాకినాడ సీపోర్టు చైర్మన్ కర్నాటి వెంకటేశ్వరరావు ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విజయసాయిరెడ్డి ఏ2గా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ సీఎం జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వై.విక్రాంత్ రెడ్డి ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా సీఐడీ కేసు పెట్టింది. అదేవిధంగా విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు, అరబిందో డైరెక్టర్ పెనక శరత్రాచంద్రారెడ్డిని ఏ3గా చేర్చారు.
గత నెలలోనే విచారణకు రమ్మని విజయసాయికి ఈడీ నోటీసులు జారీ చేయగా, పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున తాను రాలేనని, మరో రోజు సూచిస్తే వస్తానని ఈడీకి ఎంపీ విజయసాయి లేఖ రాసిన విషయం విధితమే. దీంతో 6వ తేదీన రావాల్సిందిగా ఈడీ సూచించడంతో ఆయన ఈ రోజు హాజరయ్యారు. కాకినాడ సీపోర్టులో రూ.3,600 కోట్ల విలువైన షేర్లను తక్కువ ధరకే తీసుకున్నారని విజయసాయిరెడ్డి అండ్ కో పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో మనీలాండరింగ్ జరిగిందనే అనుమానంతో ఈడీ విచారణకు పిలిచింది.