మరో రచ్చ ఖాయం.. తనిఖీ రూల్ ను మార్చిన ఈసీ!
తాజా మార్పుతో కొత్త రచ్చకు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది. ఇంతకాలం ఉన్న నిబంధనకు తాజాగా చేసిన మార్పులు పారదర్శకత మీద కొత్త సందేహాలు వ్యక్తమయ్యేలా మారాయి. తాజా మార్పుతో కొత్త రచ్చకు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలేం జరిగిందంటే..
ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించేలా ఇప్పటివరకు నిబంధనలు ఉన్నాయి. అయితే.. ఆ రూల్ ను మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో.. పోలింగ్ కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్.. వెబ్ కాస్టింగ్ రికార్డులను.. అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా బ్యాన్ విధించింది.
ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు.. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 లోని రూల్ 93(2)(ఏ) ప్రకారం రికార్డుల్ని తనిఖీ చేసేందుకు వీలుంది. అయితే.. తాజాగా కేంద్ర న్యాయశాఖ ఈ రూల్ ను సవరించింది. అయితే.. ఈ సవరణకు ఒక కోర్టు కేసు కారణమని ఈసీ.. న్యాయశాఖ వేర్వురుగా వివరణ ఇచ్చినప్పటికీ.. పారదర్శకత మీద కొత్త ప్రశ్నలు తలెత్తేలాలా తాజా నిర్ణయం ఉందన్న విమర్శ వినిపిస్తోంది.
పాత నిబంధనకు చేసిన కొత్త సవరణ పరకారం ఎలక్ట్రానిక్ రికార్డులు మినహా ఇతర పత్రాలు.. డాక్యుమెంట్లు తనిఖీకి అందుబాటులో ఉంటాయి. పోలింగ్ బూత్ లలోని సీసీ టీవీ కెమెరాల తనిఖీల కారణంగా ఓటర్ల గోప్యతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని.. ఈ కారణంతోనే బ్యాన్ విధించినట్లుగా ఈసీ చెబుతోంది. ఎన్నికల సంఘం వాదన ఏమంటే.. తామిచ్చే అధికారిక ఫుటేజ్ ను వాడుకొని ఏఐతో నకిలీ వీడియోలను తయారు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
రూల్ 93కి సవరణ తర్వాత కూడా అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ రికార్డులు అందుబాటులో ఉంటాయి కానీ వాటిని ఇతరులు తనిఖీ చేయటానికి అనుమతి ఉండదని చెబుతున్నారు. అసలీ ఇష్యూ ఎక్కడ మొదలైందన్న విషయానికి వెళితే.. హర్యానా ఎన్నికలకు సంబంధించిన అన్ని రికార్డులను మహమ్మద్ ప్రాచా అనే వ్యక్తికి షేర్ చేయాలని చెబుతూ ఇటీవల పంజాబ్ & హర్యానా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటివరకు ఉన్న నిబంధన ప్రకారం పత్రాలు.. డాక్యుమెంట్లు.. ఎలక్ట్రానిక్ రికార్డులనే విభజన లేని కారణంగా అన్ని రికార్డులను ఇవ్వాల్సిందేనని న్యాయస్థానం చెప్పింది. ఈ నిర్ణయాన్ని ఎన్నికల సంఘం వ్యతిరేకిస్తూ.. తాజా సవరణ చేపట్టింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా నిర్ణయాన్ని న్యాయపరంగా సవాలు చేస్తామని ఆ పార్టీ స్పష్టం చేసింది. కోర్టు తీర్పును పాటించాల్సిన ఈసీ.. అందుకు భిన్నంగా నిబంధనలకు సవరణలు చేయటమేంటని ప్రశ్నిస్తోంది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఈ ఇష్యూ కొత్త రచ్చకు తెర తీయటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.