ఎన్నికల్లో గెలిచినా ఇంటికే... "లెక్క"తో ఉన్న ఈ చిక్కు గురించి తెలుసా?

అవును... ఎన్నికల్లో గెలిచినా, ఓడినా... పోటీ అంటూ చేసిన తర్వాత ఒక పని తప్పకుండా చేయాలి. ఇందులో భాగంగా.. ఎన్నికలు పూర్తయిన మూడు నెలల లోపు ఆ ఎన్నికల్లో పెట్టిన ఖర్చు వివరాలను ఎన్నికల కమిషన్ కు ఇవ్వాలి.

Update: 2024-03-30 01:30 GMT

ఎన్నికల్లో పోటీ చేసి.. ఎమ్మెల్యేగానో, ఎంపీగానో గెలిచాక కూడా అనర్హత వేటు పడే అవకాశం ఉన్న ఒక కీలక అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారీ మెజారిటీతో గెలిచినా.. డిపాజిట్ కోల్పోయిన స్థాయిలో ఓడినా.. ప్రతీ అభ్యర్థీ ఎన్నికలు పూర్తయిన తర్వాత తప్పకుండా చేయాల్సిన పని ఒకటుంటుంది. గెలిచిన వాళ్లు చెయ్యకపొతే ఇబ్బంది ఉంటుందేమో.. ఓడిన వారు చేస్తే ఏమిటి చేయకపోతే ఏమిటి అనుకుంటే మాత్రం పొరపాటే!

అవును... ఎన్నికల్లో గెలిచినా, ఓడినా... పోటీ అంటూ చేసిన తర్వాత ఒక పని తప్పకుండా చేయాలి. ఇందులో భాగంగా.. ఎన్నికలు పూర్తయిన మూడు నెలల లోపు ఆ ఎన్నికల్లో పెట్టిన ఖర్చు వివరాలను ఎన్నికల కమిషన్ కు ఇవ్వాలి. ఈ క్రమంలో నేరుగా ఎన్నికల కమిషన్ కు ఇచ్చే వీలుండకపోవచ్చు కాబట్టి... స్థానిక రిటర్నింగ్ అధికారికి అందచేయాలి. అలాకానిపక్షంలో సదరు అభ్యర్థిని అనర్హులుగా ప్రకటించేందుకు ఎన్నికల సంఘానికి అధికారం ఉంటుంది.

ఈ విషయంలో గెలిచిన నేతలు, ఓడిన నేతలు అనే తారతమ్యాలేవీ ఉండవు. గెలిచిన నేతలను అనర్హులుగా ప్రకటించడంతో పాటు, ఓడిన వారిని కూడా మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పాల్గొన కుండా అనర్హత వేటు వేస్తారు. ఎన్నికల కమిషన్ నోటిఫై చేసిన తేదీ నుంచి ఈ అనర్హత అమలులోకి వస్తుంది. దీంతో మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వీలుండదు. గత ఎన్నికల్లో గుడివాడకు చెందిన కొడాలి వెంకటేశ్వర రావు అనే అభ్యర్థిపై ఎన్నికల సంఘం ఇలానే అనర్హత వేటు చేసింది.

కొడాలి వెంకటేశ్వర రావు అంటే.. కొడాలి నాని అనుకునేరు! ఆయన పూర్తి పేరు కొడాలి శ్రీవెంకటేశ్వర రావు!! ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వ్యక్తి ప్రజాశాంతి పార్టీకి చెందిన అభ్యర్థి! 2019 ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈయన ఆ ఎన్నికల్లో పెట్టిన ఖర్చుల వివరాలు వెల్లడించలేదు. దీంతో... ఎన్నికల సంఘం ఈయనపై మూడు ఏళ్లపాటు అనర్హత వేటు వేసింది. ఫలితంగా మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం కొడాలి వెంకటేశ్వర రావుకి లేదు!

ఇది పైన చెప్పుకొన్న ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి ఒక్కరిదే అనుకుంటే పొరపాటే సుమా! రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా ఈ బాపతు నేతలు 1,069 మంది ఉన్నారని చెబుతున్నారు! ఈ 1,069 మంది గత లోక్ సభ, వివిధ రాష్ట్రాల శానసభ ఎన్నికల్లో పోటీ చేసి, ఖర్చుల వివరాలను ఎన్నికల కమిషన్ కి చెప్పలేదు! ఇందులో మాగ్జిమం అభ్యర్థులు... ఈ విషయం తెలియకే ఖర్చుల వివరాలు చెప్పలేదన్నారని తెలుస్తుండటం గమనార్హం.

ప్రజాప్రాతినిధ్య చట్టం ఏం చెబుతోంది?

1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ - 10ఏ ప్రకారం... ఎన్నికలు ముగిసిన తర్వాత గరిష్టంగా మూడు నెలలలోపు ఖర్చుల వివరాలను ఎన్నికల కమిషన్ కు అందచేయాలి. ఈ చట్ట ప్రకారం ఆ మూడు నెలల లోపు ఖర్చుల వివరాలు చెప్పనిపక్షంలో మూడేళ్ల పాటు అనర్హత వేటు వేసే అధికారాన్ని ఎన్నికల సంఘం కలిగి ఉంటుంది.

అందుకే ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ అభ్యర్థీ తప్పనిసరిగా తమ తమ ఖర్చుల వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎన్నికల్లో గెలిచిన వారు, ఓడినవారు అనే తేడాలేమీ ఉండవు. ఎన్నికల్లో గెలుపోటములకు, ఖర్చుల లెక్కలు చెప్పడానికీ సంబంధం లేదు. పోటీ చేసిన ప్రతీఒక్కరూ ఖర్చుల వివరాలు వెల్లడించాల్సిందే!

ఈ సమయంలో.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఇలా ఖర్చుల లెక్కలు చెప్పక అనర్హత వేటు పడిన వారి సంఖ్యలు ఈ విధంగా ఉన్నాయి!

బీహార్ - 237

ఉత్తరప్రదేశ్ - 121

తెలంగాణ - 107

మధ్యప్రదేశ్ - 79

కర్ణాటక - 75

చత్తీస్ గఢ్ - 73

హరియాణ - 55

ఆంధ్రప్రదే - 51

కేరళ - 43

ఒడిశా - 35

తమిళనాడు - 27

ఝార్ఖాండ్ - 26

ఉత్తరాఖాండ్ - 24

ఢిల్లీ - 21

మహారాష్ట్ర - 18

రాజస్థాన్ - 18

పశ్చిమ బెంగాల్ - 17

గుజరాత్ - 9

పంజాబ్ - 7

అండమాన్ నికోబార్ - 5

లక్షదీప్ - 1

Tags:    

Similar News