శనివారమే ఎన్నికల షెడ్యూల్... టైం ఫిక్స్ చేసిన ఈసీ!
శనివారమే లోక్ సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
గతకొన్ని రోజులుగా.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సమయం ఆసన్నమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన చేసింది. శనివారమే లోక్ సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీనికోసం టైం ని కూడా ఫిక్స్ చేసింది ఈసీ. దీంతో... రాజకీయవర్గాల్లో కొత్త సందడి మొదలైంది. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... సార్వత్రిక ఎన్నికలకు శనివారం (మార్చి - 16) నగారా మోగనుంది. ఇందులో భాగంగా శనివారం నాడు లోక్ సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ ఆన్ లైన్ వేదికగా ప్రకటించింది! ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించనుంది.
ఇందులో భాగంగా.. లోక్ సభ తో పాటుగానే ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా షెడ్యూల్ ను ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో రేపటి నుంచి పోలింగ్ తేదీకి సంబంధించిన కౌంట్ డౌన్ స్టార్ట్ కాబోతుంది. ఇక టైం ఫ్రేం లో లక్ష్యాలు పెట్టుకుని రాజకీయ పార్టీలు ప్రచారాలతో హోరెత్తించడానికి సిద్ధమవుతున్నాయి.
కాగా... ప్రస్తుత లోక్ సభకు జూన్ 16వ తేదీలోపు గడువు ముగియనుంది. ఇదే సమయంలో... ఆంధ్రప్రదేశ్ తో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఈ ఏడాది మే లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో... ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషన్... స్థానిక రాజకీయ పార్టీలతో పాటు, క్షేత్రస్థాయిలో అధికారులతో సమావేశాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే షెడ్యూల్ ను సిద్ధం చేసింది.