ఒక్క ఓటుతో విజేతలుగా నిలిచారు !

2008. రాజస్థాన్ శాసనసభ ఎన్నికలు. నాథ్ ద్వారా నియోజకవర్గం. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి సీపీ జోషీ బరిలో ఉన్నాడు

Update: 2024-05-13 05:41 GMT

2008. రాజస్థాన్ శాసనసభ ఎన్నికలు. నాథ్ ద్వారా నియోజకవర్గం. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి సీపీ జోషీ బరిలో ఉన్నాడు. బీజేపీ నుండి కళ్యాణ్ సింగ్ చౌహాన్ పోటీ పడుతున్నాడు. పోలైన ఓట్లన్నీ లెక్కించగా కాంగ్రెస్ అభ్యర్థి సీపీ జోషీకి 62,216ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ సింగ్ చౌహాన్ కు 62,216 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు తేడాతో కళ్యాణ్ సింగ్ గెలిచినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

కళ్యాణ్ సింగ్ సతీమణి రెండు చోట్ల ఓటు వేసినందున వాటిని రద్దు చేయాలని సీపీ జోషి హైకోర్టుకు వెళ్లాడు. ఆ తర్వాత సుప్రీం కోర్టుకూ వెళ్లాడు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మరో సారి ఓట్లను లెక్కించారు. ఈసారి ఇద్దరికీ ఓట్లు సమానంగా రావడంతో ఎన్నికల అధికారులు విజేతలను నిర్ణయించేందుకు డ్రా పద్దతిని ఆశ్రయించారు. అందులో కూడా కాంగ్రెస్ అభ్యర్థి సీపీ జోషిని దురదృష్టం వెంటాడింది. కళ్యాణ్ సింగ్ నే అదృష్టం వెంటాడింది. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే పోలింగ్ రోజున కాంగ్రెస్ అభ్యర్థి జోషి తల్లి, సోదరి, కారు డ్రైవర్ ముగ్గురూ ఓటు హక్కును వినియోగించుకోలేదు.

కర్ణాటకలోని సంతేమరహల్లి నియోజకవర్గంలో 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కూడా ఇలాంటి విచిత్రమే చోటు చేసుకున్నది. ఆ ఎన్నికల్లో జెడీఎస్‌ అభ్యర్థిగా ఏఆర్‌ కృష్ణమూర్తి పోటీ చేయగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆర్‌. ధృవనారాయణ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జెడీఎస్‌ అభ్యర్థి కృష్ణమూర్తికి 40 వేల 751 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి ధృవ్‌నారాయణకు 40వేల 752 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయననే విజేతగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక్కడ కూడా కృష్ణమూర్తి డ్రైవర్ ఓటు వేయాల్సి ఉన్నా .. పోలింగ్ రోజున విధులలో విరామం లభించక ఓటు వేయలేకపోయాడు.

2018లో జరిగిన మిజోరాం అసెంబ్లీ ఎన్నికలలో తుయివాల్ (ST) అసెంబ్లీ స్థానం నుండి మిజోరాం నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి లాల్‌చందమా రాల్టే కేవలం మూడు ఓట్ల తేడాతో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ఎల్ పియాన్మావియాను ఓడించారు. ఈ ఎన్నికల్లో రాల్టేకు 5,207 ఓట్లు రాగా, పియాన్మావియాకు 5,204 ఓట్లు వచ్చాయి. ఫలితంపై అసంతృప్తితో ఉన్న పియాన్మావియా ఓట్లను మళ్లీ లెక్కించాలని డిమాండ్ చేశారు. రీకౌంటింగ్ తర్వాత కూడా ఓట్ల తేడాలో మార్పు లేదు.

1989 లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కొణతాల రామకృష్ణ టీడీపీ అభ్యర్థి అప్పల నరసింహం మీద కేవలం 9 ఓట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. ఇక్కడ కొణతాల రామకృష్ణకు 299109 ఓట్లు రాగా, అప్పల నరసింహానికి 2,99,100 ఓట్లు రావడం విశేషం.

1998లో బీహార్‌లోని రాజ్‌మహల్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సోమ్ మరాండీ కూడా కేవలం తొమ్మిది ఓట్ల తేడాతోనే విజయం సాధించాడు. ఇక్కడ సోమ్ మరాండీకి 1,98,889 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి థామస్ హన్సాకి 1,98,880 ఓట్లు వచ్చాయి.

2014 లోక్‌సభ ఎన్నికలలో, బీజేపీకి చెందిన తుప్‌స్తాన్ ఛెవాంగ్ లడఖ్ నుండి కేవలం 36 సీట్ల తేడాతో విజయం సాధించారు. తుప్‌స్తాన్ ఛెవాంగ్ కు 31,111 ఓట్లు రాగా, ప్రత్యర్ధిగా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి గులామ్ రజాకు 31,075 ఓట్లు రావడం విశేషం. అందుకే ఎన్నికలలో ప్రతి ఓటూ విలువైనదే. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి.

Tags:    

Similar News