పుంగనూరుకు ప్రముఖ విద్యుత్ బస్సు తయారీ సంస్థ యూనిట్లేదా

ఈ పరిశ్రమలో ఎలక్ట్రిక్ బస్సులతో పాటు.. డీజిల్ బస్సుల్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రిట్రోఫిట్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తారు

Update: 2023-11-18 04:38 GMT

కీలకమైన పెట్టుబడుల ప్రకటన ఒకటి వచ్చింది. పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్న వేళ.. అందరూ అచ్చెరువు పొందేలా వచ్చిన ఈ ప్రకటనతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు దశను దిశను మార్చేస్తుందని చెబుతున్నారు. జర్మనీకి చెందిన ప్రముఖ విద్యుత్ బస్సులు.. ట్రక్కుల తయారీ సంస్థ ఏపీకి రానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద తయారీ యూనిట్ ను ఏపీలో నెలకొల్పనుంది. దీనికి పుంగనూరు వేదిక కానుంది.

చైనా బయట ఈ స్థాయిలో ఇంత భారీగా యూనిట్ ఏర్పాటు చేయటం ఇదే తొలిసారి. ఏపీ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ భారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిశ్రమ కోసం 800 ఎకరాల భూమిని.. పెద్ద ఎత్తున రాయితీల్ని ఇవ్వనున్నారు. ఈ పరిశ్రమ కోసం రూ.4640 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ పరిశ్రమ కారణంగా 8080 మందికి ఉపాధి లభించనుంది.

ఈ పరిశ్రమలో ఎలక్ట్రిక్ బస్సులతో పాటు.. డీజిల్ బస్సుల్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రిట్రోఫిట్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తారు. ఈ నెలాఖరులో యూనిట్ నిర్మాణం ప్రారంభం కానుంది. 2025 ప్రారంభం నాటికి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. 2027 నాటికి ఏటా 50వేలకు పైగా బస్సులు.. ట్రక్కులు తయారు చేసే సామర్థ్యానికి చేరుకుంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల్ని కూడా ఇక్కడే ఉత్పత్తి చేసి.. అంతర్జాతీయంగా సరఫరా చేసే ఆలోచనలోనూ కంపెనీ ఉంది. ఏపీ ఇమేజ్ ను మరింత పెంచే ఈ పరిశ్రమతో మరిన్ని విదేశీ పెట్టుబడులు రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News