బ్లాక్ చేయబడినవారు చూస్తారు కానీ... ఎక్స్ లో మస్క్ కొత్త ఆలోచన!
స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ "ట్విట్టర్"ను కొనుగోలు చేసినప్పటి నుంచీ అనేకానేక మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే.
స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ "ట్విట్టర్"ను కొనుగోలు చేసినప్పటి నుంచీ అనేకానేక మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఉద్యోగులను తొలగించడంతో పాటు బ్రాండ్ లోగోను మార్చడం, పేమెంట్ ఫర్ బ్లూటిక్ ఆప్షన్ తీసుకురావడం వంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. వీటితో పాటు ట్విట్టర్ ను ఎక్స్ గా మార్చారు.
ఇలా తన చేతుల్లోకి వచ్చినప్పటి నుంచి ట్విట్టర్ లో అనేక కీలక మార్పులు చేశారు ఎలాన్ మస్క్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎక్స్ లోని "బ్లాక్" బటన్ ను తీసేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఇచ్చిన వివరణ, నెటిజన్ల రియాక్షన్స్ తో నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది.
ఎక్స్ లో ప్రస్తుతం బ్లాక్ బటన్ ను తీసివేయబోతున్నారు. అంటే... అకౌంట్ పబ్లిక్ గానే ఉంటుంది. ఈ సమయంలో ఎవరైనా ఓ వ్యక్తి తన ఎక్స్ లో ఏదైనా పోస్ట్ చేస్తే... సదరు వ్యక్తి బ్లాక్ చేసిన యూజర్ కూడా ఈ పోస్ట్ ను చూడగలరు. కాకపోతే.. దీనిని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయాడం వంటిని మాత్రం చేయలేరన్నమాట.
ఈ బ్లాక్ బటన్ తొలగింపుకు సంబంధించిన పోస్ట్ పై స్పందించిన ఎలాన్ మస్క్... బ్లాక్ ఫంక్షన్ అనేది ఎంగేజ్ చేయకుండా బ్లాక్ చేస్తుంది కానీ.. పబ్లిక్ పోస్టులను చూడకుండా నిరోధించదు అని స్పష్టం చేశారు. దీంతో... ఈ ఆలోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా... ఎక్స్ లో అకౌంట్లను బ్లాక్ చేసే ఫీచర్ కు స్వస్తి పలుకుతున్నట్లు ఎలాన్ మస్క్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆప్షన్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. అందువల్లే దీన్ని తొలగించనున్నట్లు పేర్కొన్నారు. అయితే... ఇది ఆన్ లైన్ వేధింపులకు గురి చేస్తుందని పలువురు యూజర్లు వాపోయారు. ఈ నేపథ్యంలోనే.. బ్లాక్ చేయబడిన వ్యక్తి పోస్ట్ పై స్పందించడానికి అవకాశం లేదని మస్క్ తెలిపారు!