జుకర్ తో ఫైట్ కు ముందు మస్క్ కు సర్జరీ... కారణం ఇదే!
ఈ నేపథ్యంలో జుకర్ బర్గ్ తో కేజ్ ఫైట్ కోసం తాను సిద్ధంగా ఉన్నానని మస్క్ ట్విటర్ లో తన అభిమానులకు చెప్పారు.
గతకొంతకాలంగా... ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కేజ్ ఫైట్ పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరూ తలపడనున్నారనే విషయం కన్ ఫాం అయ్యిందని చెబుతున్నారు. ఈ సమయంలో తనకు సర్జరీ అవసరం అని అంటున్నారు మస్క్!
ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ - ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్ కు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ ఫైట్ డేట్ ఎప్పుడు అని అడిగిన నెటిజన్లకు ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు మస్క్. ఇందులో భాగంగ... ఫైట్ డేట్ ఇంకా ఖరారు కాలేదని, అయితే ఫైట్ కి ముందు సర్జరీ అవసరం అని అన్నాడు.
అవును.. మార్క్ జుకర్ బర్గ్ తో కేజ్ ఫైట్ కి ముందు తనకు సర్జరీ అవసరం పడొచ్చని అంటున్నారు మస్క్. తన మెడ, వీపు పై భాగంలో సర్జరీ జరిగే అవకాశం ఉందని.. ఈ విషయంపై ఈ వారంలో స్పష్టత వస్తుందని తెలిపారు.
ఇదే సమయంలో మార్క్ జుకర్ బర్గ్ తో కేజ్ ఫైట్ విషయాన్ని తాజాగా ఎలాన్ మస్క్ ధ్రువీకరించారు. జుకర్ బర్గ్ తో తాను చేసే పోరాటాన్ని ఎక్స్ (ట్విట్టర్) లో ప్రత్యక్ష ప్రసారం చేస్తానని ట్వీట్ చేశారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థలకు అందిస్తామని ప్రకటించారు.
కొన్నాళ్ల క్రితం మార్క్ జుకర్ బర్గ్ తాను ట్రైనింగ్ తీసుకుంటున్న ఫొటోలను పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఫైట్ జరగడం సీరియస్ అనే చర్చ జరిగింది. మార్క్ జుకర్ బర్గ్ "జియుజిట్సు" అనే ప్రత్యేకమైన మార్షల్ ఆర్ట్ లో కూడా శిక్షణ తీసుకుంటున్నాడు.
అంతకు ముందు ఎలాన్ మస్క్ "ఎక్స్"లో చేసిన పోస్టులో.. తాను రోజంతా బరువులు ఎత్తుతున్నానని, పోరాటానికి సిద్ధమవుతున్నానని చెప్పాడు. వర్కవుట్ చేయడానికి సమయం దొరకడం లేదని, అందుకే బరువులు తీసుకుని పని చేస్తున్నానని చెప్పాడు.
కాగా.. 51 ఏళ్ల మస్క్, 39 ఏళ్ల జుకర్ బర్గ్ మధ్య గతకొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ మధ్య ట్విటర్ కు పోటీగా మెటా కొత్త యాప్ "థ్రెడ్స్" ప్రకటించినప్పుడు అది తారస్థాయికి చేరింది.
ఈ నేపథ్యంలో జుకర్ బర్గ్ తో కేజ్ ఫైట్ కోసం తాను సిద్ధంగా ఉన్నానని మస్క్ ట్విటర్ లో తన అభిమానులకు చెప్పారు. ఆ మధ్య మార్షల్ ఆర్ట్స్ వీడియోలను జుకర్ బర్గ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా "ఫైట్ లొకేషన్ పంపించు" అంటూ ప్రతిస్పందించారు ఎలాన్ మస్క్.