ఇక..'సైరన్' కూడా భారతీయమే!
ఏంటి? అని బుగ్గలు నొక్కుకుంటున్నారా? నిజమే. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారు.
ఏంటి? అని బుగ్గలు నొక్కుకుంటున్నారా? నిజమే. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారు. ఇప్పటి వరకు పీం-పీం అనో.. బర్-బర్ మనో మన వాహనాలకు సైరన్‌లు ఉన్నాయి. ఇక, వీఐపీలు.. కుయ్..కుయ్ మనే సరైన్లు ప్రత్యేకంగా ఉంటాయి. వీటి మోత వినగానే మనం ఎంత వేగంతో ఉన్నా.. ఎంత అర్జెంటు పనున్నా.. పక్కకు తప్పుకొని ఆయా వాహనాలకు దారి విడవాల్సిందే. ఇక, ఇదే సరైన్ పోలీసుల వాహనాలకు.. అంబులెన్స్‌లకు కొంత `పిచ్`లో తేడాతో ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఈ సైరన్లకు అలవాటు పడిపోయాం.
అయితే.. ఇప్పుడు ప్రధాని మోడీ.. అన్నింటినీ భారతీయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సరైన్లను కూడా భారతీయం చేయనున్నారట. ఇప్పటికే ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియాఅంటూ.. ప్రతి పథకంలోనూ భారతీయతను జోడించారు. రెండురోజుల కిందట కీలకమైన చట్టాలైన ఐపీసీ, సీఆర్‌పీసీ, ఏఐవోలను కూడా భారతీయం చేసేశారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య పేరుతో ఈ బిల్లులు తీసుకువచ్చారు.
ఈ పరంపరలోనే తాజాగా వాహనాలకు ఉండే సరైన్లను కూడా.. భారతీయం చేస్తున్నట్టు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వాహనాల సైరన్ మోతను వినసొంపుగా మార్చేందుకు కొత్త విధివిధానాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. వీఐపీల వాహనాలపై ఉండే రెడ్ లైట్ సంస్కృతికి ముగింపు పలికినట్టే.. వీఐపీ వాహనాల్లో సైరన్ కూడా తొలగించాలనుకుంటున్నట్టు చెప్పారు. సైరన్‌కు బదులుగా భారతీయ శాస్త్రీయ సంగీత వాయిద్యాలైన పిల్లనగ్రోవి, తబలా, వయోలిన్, శంఖం వంటి వాటి ద్వారా రూపొందించిన శబ్దం వినపడేలా మార్పులు చేయనున్నట్టు మంత్రి వర్యులు సెలవిచ్చారు.