ఈటల ఇంట్లో కిలోన్నర బంగారం... ఆస్తుల వివరాలివే!

ఎవరికి వారు తమకు అనుకూలమైన సమయాలను ఎంచుకుని నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు. ఈ

Update: 2023-11-08 05:06 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరికి వారు తమకు అనుకూలమైన సమయాలను ఎంచుకుని నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లలో తమ ఆస్తులు, అప్పులు, తమపై నమోదై ఉన్న కేసుల వివరాలను వెల్లడిస్తున్నారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ కీలక నేత ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు.

అవును... హుజూరాబాద్‌ భారతీయ జనతాపార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌.. అఫిడవిట్ లో తన ఆస్తులు, తనపై ఉన్న కేసులు మొదలైన వివారాలు వెల్లడించారు. ఈటల రాజేందర్‌ తరఫున ఆయన సోదరుడు భద్రయ్య.. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ అందజేశారు. ఆ సమయంలో నామినేషన్ తో పాటు ఎన్నికల అఫిడవిట్‌ కూడా సమర్పించారు.

ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమ సమయం నుంచి శాసనసభలో నిరసన కార్యక్రమాల వరకూ కలిపి మొత్తంగా తనపై 40 కేసులు పెండింగ్‌ లో ఉన్నట్లు హుజూరాబాద్‌ భారతీయ జనతాపార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అఫిడవిట్లో వెల్లడించారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉప్పల్‌ స్టేషన్‌ తో పాటు పలు చోట్ల రైలు పట్టాలపై చేపట్టిన ఆందోళనకు సంబంధించి కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తనపేరుమీద రూ.12.50 కోట్ల స్థిరాస్తులు, రూ.16.74 లక్షల చరాస్తులూ ఉన్నాయని.. వీటితోపాటు రూ.3.48 కోట్ల అప్పులు ఉన్నట్లు ఈటల రాజేందర్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇదే సమయంలో... తన వద్ద ప్రstutam రూ.లక్ష నగదు మాత్రమే ఉన్నట్లు చూపించారు ఈటల రాజేందర్. ఇదే సమయంలో ఆయన భార్య పేరుమీద ఉన్న ఆస్తుల వివరాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా.. ఈటల భార్య ఈటల జమున పేరుమీద రూ.14.78 కోట్ల స్థిరాస్తులు, రూ.26.48 కోట్ల చరాస్తులతోపాటు 1,500 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు వివరించారు. అదేవిధంగా... రూ.15.51 కోట్ల అప్పులు ఉన్నాయని, ప్రస్తుతానికి లక్షన్నర రూపాయల క్యాష్ మాత్రమే తమ దగ్గర ఉందని తెలిపారు! ఇలా తనకు మొత్తం రూ.53.94 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఈటల వెల్లడించారు.

ఇలా తాజాగా ఈటల రాజేందర్ తోపాటు మరికొంతమంది ప్రముఖ నేతలు తమ తమ ఆస్తుల వివరాలు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా... ఖమ్మం నియోజకవర్గం నుంచి బీఆరెస్స్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌.. తమ కుటుంబానికి రూ.51.40 కోట్ల ఆస్తులున్నాయని పేర్కొన్నారు.

ఇదే సమయంలో... నల్గొండ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కుటుంబానికి రూ.39.55కోట్ల ఆస్తులు ఉన్నాయని.. ఆయన భార్య సబితకు 2.1కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇదే సమయంలో... ఆస్తులతో పాటు రూ.6.44కోట్ల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌ లో తెలిపారు. కాగా... పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కోటీశ్వరులే ఎక్కువగా ఉండటం గమనార్హం!

Tags:    

Similar News