నాడు హుజూరాబాద్.. నేడు గజ్వేల్.. రేపు జరగబోయేది ఇదే!

అయితే... ఈటల రాజేందర్ మాత్రం కేసీఆర్ ని ఓడించాలని మాంచి పట్టుమీదున్నారని అంటున్నారు!

Update: 2023-10-26 12:15 GMT

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని, తద్వారా జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలని అధికార బీఆరెస్స్ పథకాలు రచిస్తుంది. మరోపక్క కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ చేయాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇదే సమయంలో కర్ణాటక ఫలితాల అనంతరం దక్షిణాదిలో దారులు మూసుకుపోతున్నాయి అనే కామెంట్లకు చెక్ పెట్టాలని బీజేపీ తాపత్రయ పడుతుంది. అయితే... ఈటల రాజేందర్ మాత్రం కేసీఆర్ ని ఓడించాలని మాంచి పట్టుమీదున్నారని అంటున్నారు!

అవును... అధికారంలోకి రావడం అనేది ఏ ఒక్కరి చేతుల్లోనూ ఉండదు. పైగా జాతీయ పార్టీల విషయంలో అయితే అది అసలే సాధ్యం కాదు! అక్కడ సమిష్టి కృషి అనివార్యం! ఈ సమయంలో పార్టీ లక్ష్యాలతో పాటు తనకంటూ ఒక పర్సనల్ అజెండా పెట్టుకున్నట్లున్నారు ఈటెల రాజేందర్. ఇందులో భాగంగా ఈసారి గజ్వేల్ లో కేసీఆర్ ని ఓడించాలని కంకణం కట్టుకున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆయన ఈసారి హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ లోనూ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా వర్గల్‌ సరస్వతీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఈటెల రాజేందర్.. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... గజ్వేల్‌ లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివని, ఈ యుద్ధంలో కేసీఆర్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ మట్టికరిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఇదే సమయంలో... ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆరెస్స్ కు బుద్ధి చెబుతారని.. ఎన్ని కుయుక్తులు పన్నినా గజ్వేల్‌ లో గెలిచేది బీజేపీనే అని ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక గజ్వేల్‌ లో ఏ పార్టీ అయినా మీటింగ్ పెట్టుకోవచ్చు కానీ... బీజేపీ సమావేశాలు నిర్వహిస్తే మాత్రం ప్రజలను అడ్డుకుంటున్నారని ఈటెల ఫైరయ్యారు.

అదేవిధంగా... ఎవరైనా బీజేపీ సభలకు, సమావేశాలకూ రావడానికి రెడీ అవుతుంటే... దావతులు ఇచ్చి, పైసలు పంచి రాకుండా ఆపేస్తున్నారని విమర్శించారు. నాడు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సమయంలోనూ ఇలాంటి పనులే చేశారని.. అయితే, అక్కడ ప్రజలు ఇలాంటి చేష్టలను పాతరేశారని తెలిపారు. అదేతరహాలో ఈసారి గజ్వేల్‌ లో కూడా చేయాలని.. ఫలితంగా ప్రజాస్వామ్యాన్ని, ధర్మాన్ని కాపాడాలని గజ్వేల్‌ ప్రజలకు పిలుపునిచ్చారు ఈటెల.

ఈ సందర్భంగా గజ్వేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ఈటెల రాజేందర్. ఇందులో భాగంగా... గజ్వేల్‌ కు తానేమీ కొత్త కాదని, గజ్వేల్‌ లోనే తొలి పౌల్ట్రీ ఫాం ఏర్పాటు చేసి జీవితం ప్రారంభించినట్లు చెప్పారు ఈటెల. ఇక తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో గజ్వేల్‌ లోనే ఎక్కువగా తిరిగినట్లు గుర్తుచేసుకున్న ఆయన... నాడు సొంత ప్రాంతంలో తిరగాలని కేసీఆర్‌ చెప్తే.. హుజురాబాద్‌ లో ఉద్యమం నడిపినట్లు తెలిపారు.

Tags:    

Similar News