మనదేశంలో 3 నకిలీ మార్కెట్లు.. అవేంటో చెప్పిన అమెరికా
మోసపూరిత మార్కెట్ల స్థానంలో చైనా మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటికే మొదటి స్థానంలో ఉన్న దాని స్థానం చెక్కు చెదర్లేదు
అగ్రరాజ్యం అమెరికా ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా సిద్దం చేసిన ఒక జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా మోసపూరితమైన మార్కెట్లు ఉన్న ప్రదేశాల్ని గుర్తించి వాటి వివరాల్ని వెల్లడించింది. తాజాగా భారతదేశానికి చెందిన మూడు మార్కెట్లను తన తాజా లిస్టులో పేర్కొంది. 2023నాటికి నొటోరియస్ మార్కెట్స్ లిస్టులో భారత్ కు చెందిన మూడు మార్కెట్లు ఉండటం గమనార్హం. ఈ మార్కెట్లలో లభించే వస్తువులు.. వస్తుసేవలన్ని కూడా మోసపూరితంగా పేర్కొంది. అంతేకాదు.. మూడు ఆన్ లైన్ పోర్టల్లను కూడా మోసపూరితంగా పేర్కొంది.
మోసపూరిత మార్కెట్ల స్థానంలో చైనా మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటికే మొదటి స్థానంలో ఉన్న దాని స్థానం చెక్కు చెదర్లేదు. ఈ లిస్టులో మొత్తం 39 ఆన్ లైన్.. 33 సంప్రదాయ మార్కెట్లను పేర్కొంది. మనదేశానికి సంబంధించి సంప్రదాయ మార్కెట్లుగా పేర్కొనే వాటికి సంబంధించి మూడింటిని అత్యంత మోసపూరిత మార్కెట్లుగా పేర్కొంది. వాటిల్లో మొదటిది ముంబయిలోని హీరా పన్నా కాగా, రెండోది ఢిల్లీలోని కరోలో భాగ్.. మూడోది బెంగళూరులోని ఎస్ పీ రోడ్ మార్కెట్లుగా పేర్కొంది.
ఇక.. ఆన్ లైన్ పోర్టళ్ల విషయానికి వస్తే.. ఇండియా మార్ట్.. వెగా మూవీస్.. డబ్ల్యూహెచ్ఎమ్ సీఎస్ స్మార్టర్స్ అనే మూడు ఆన్ లైన్ మార్కెట్లను మోసపూరిత మార్కెట్లుగా పేర్కొంది. నకిలీ వస్తువులతో పాటు పైరసీ వస్తువుల వాణిజ్యం ఇక్కడ ఎక్కువగా జరుగుతుందని పేర్కొంది. ఈ మార్కెట్ల కారణంగా కార్మికులు.. వినియోగదారులతో పాటు చిన్న వ్యాపారులకు.. మొత్తంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేటు చేసే మార్కెట్లుగా వెల్లడించింది.
అమెరికా రిపోర్టును పక్కన పెడితే.. దేశీయంగా ఈ మూడు మార్కెట్ల విసయానికి వస్తే.. ఢిల్లీలోని కరోల్ భాగ్ లోని ట్యాంక్ రోడ్ హోల్ సేల్ వ్యాపారానికి కేరాఫ్ అడ్రస్ గా చెబుతారు. ఇక్కడ వస్తువుల ధరలు చాలా చౌకగా లభిస్తాయి. బెంగళూరులోని కేఆర్ మార్కెట్ వద్ద ఎలక్ట్రానిక్స్..హార్డ్ వేర్.. మెషిన్ టూల్ వస్తువులు చౌకగా లభిస్తాయి. ముంబయిలోని హజీ అలీ జంక్షన్ వద్ద ఉండే హీరా పన్ను షాపింగ్ సెంటర్ లో అంతర్జాతీయ బ్రాండ్లకు సంబంధించిన డూప్లికేట్ వస్తువులు లభిస్తుంటాయి.
చైనా విషయానికి వస్తే.. తౌబౌ.. వీచాట్.. డీహెచ్ గేట్.. పిన్ డియోడియోలతో పాటు క్లౌడ్ స్టోరేజీ సర్వీస్ బైదూ.. వాంగ్ పాన్ లను కూడా ఈ జాబితాలోకి చేర్చింది. 2022లో అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ పట్టుకున్న మొత్తం నకిలీ వస్తువుల విలువలో చైనా నుంచి వచ్చిన వస్తువులే 60 శాతానికి పైగా ఉండటం గమనార్హం.