చంద్రబాబు కృష్ణుడు, పవన్ అర్జునుడు... గచ్చిబౌలిలో ఫ్యాన్స్ హుషార్!
ఈ కార్యక్రమంలో బెంగళూరు నుంచి వచ్చిన బీట్ గురు బ్యాండ్ సభ్యులు సంగీతంతో అందరినీ ఉర్రూతలూగించారు.
హైదరాబాద్ లో సైబర్ టవర్స్ నిర్మించి 25 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో.. ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసి, నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి తో ప్రారంభోత్సవం చేయించిన చంద్రబాబుకు కృతజ్ఞత తెలిపేందుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ఆధ్వర్యంలో "సీబీఎన్స్ గ్రాటిట్యూడ్" పేరిట ఆదివారం సాయంత్రం జీఎంసీ బాలయోగి స్టేడియంలో సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాం కి భారీ ఎత్తున బాబు అభిమానులు తరలివచ్చారు.
అవును... ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు సైబర్ టవర్స్ నిర్మించి 25 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో జీఎంసీ బాలయోగి స్టేడియంలో సంగీత విభావరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రఘురామకృష్ణరాజు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఏబీ వెంకటేశ్వరరావు, ఏపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, మురళీమోహన్, బోయపాటి శ్రీను, బండ్ల గణేష్, కొంతమంది నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో బెంగళూరు నుంచి వచ్చిన బీట్ గురు బ్యాండ్ సభ్యులు సంగీతంతో అందరినీ ఉర్రూతలూగించారు. సినీ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బృందం అందరినీ హుషారెత్తించింది. ఈ కార్యక్రమానికి హాజరైన జనాలు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. దీంతో... కేరింతలతో గచ్చిబౌలి స్టేడియం హోరెత్తింది. ఈ సందర్భంగా పలువురు నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా బాబుని కొనియాడారు.
ఈ సందర్భగా మైకందుకున్న మాగంటి మురళీ మోహన్... చంద్రబాబును జైల్లో పెట్టడంతో తెలుగు ప్రజల గుండెలు మండిపోతున్నాయి. అరాచక శక్తులకు గుణపాఠం చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. అనంతరం చంద్రబాబు శ్రీకృష్ణుడైతే, పవన్ కల్యాణ్ అర్జునుడు అని మొదలుపెట్టిన రఘురామ కృష్ణరాజు... ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ పోలీసులకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెల్యూట్ అని చెప్పారు.
ఇదే సమయంలో చంద్రబాబు జైల్లో ఉండటం వల్ల వినాయక చవితి, దసరా పండుగ జరుపుకోలేదని.. ఆయన బయటకు వస్తే దీపావళిని బాగా చేసుకుందామని అన్నారు బండ్ల గణేష్. అనంతరం తెలుగు రాష్ట్రాలకు చంద్రబాబు తండ్రిలాంటివారని, చరిత్ర ఉన్నంతవరకు ఆయన ఉంటారని సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో... హైటెక్ సిటీ పేరుతో విశ్వనగరాన్ని నిర్మించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని రాఘవేంద్ర రావు ట్విట్టర్ లో పేర్కొన్నారు.
అనంతరం... హైదరాబాద్ లోని గచ్చిబౌలి సైబర్ టవర్స్ రజతోత్సవం సందర్భంగా బాలయోగి స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఐటీ ఉద్యోగులకు నారా లోకేష్ అభినందనలు తెలిపారు.
కాగా... డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సర్వర్ కోసం నాటి ప్రధాని రాజీవ్ గాంధీని రిక్వెస్ట్ చేసుకునే సమయంలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి సీఎంగా ఉన్నారని.. ఆయనే నాడు సైబర్ టవర్స్ కు పునాది వేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం 1998 నవంబర్ 22న సైబర్ టవర్స్ ను అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి చేతుల మీదుగా ప్రారంభించారు.
మరోపక్క స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆదివారంతో ఆయన జైలుకు వెళ్లి 50 రోజులు పూర్తయ్యింది!